
మూసీ నది ఆక్రమించి నిర్మించిన పార్కింగ్ షెడ్లను తొలగించింది హైడ్రా. మంగళవారం ( జులై 29 ) చాదర్ ఘాట్ బ్రిడ్జి ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా మార్చురీ వరకు ఉన్న ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. మూసి నదిని ఆక్రమించి వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు ఆక్రమణదారులు.
మూసీ నదిలో మట్టి పోసి మరీ షెడ్డులు నిర్మనించి కిరాయికి ఇస్తున్నారు ఆక్రమణదారులు. దీంతో హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సుమారు పది ఎకరాల స్థలంలో ఆక్రమణలు తొలగించింది. కబ్జా చేసినవారంతా అక్కడ షెడ్లు వేసి, వాటికని బస్సులు, లారీల పార్కింగ్ కోసం అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. తికారం అనే వ్యక్తి మూడు ఎకరాలు, పూనమ్ చాంద్ యాదవ్ అనే వ్యక్తి ఎకరం 30 గుంటలు, జయకృష్ణ అనే వ్యక్తి 5 ఎకరాల 22 గుంటలు కబ్జా చేసినట్లు తెలిపారు హైడ్రా అధికారులు. ఆక్రమణలు తొలగించిన అధికారులు మళ్ళీ కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.