
- 8,332 సెంటర్ల ద్వారా 75 లక్షల టన్నులు కొనేందుకు ఏర్పాట్లు
- ప్రొక్యూర్‌మెంట్ ప్రిపరేటరీ మీటింగ్‌లో సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అక్టోబర్1 నుంచి వానాకాలం వడ్ల కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సీజన్‌లో 159.15 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలతో 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని భావిస్తున్నది. ఈ మేరకు సోమవారం సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీ.ఎస్.చౌహాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొక్యూర్‌మెంట్ ప్రిపరేటరీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపడ్తామని చౌహాన్ చెప్పారు. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించబోమని స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బందులు కలగొద్దు
వానాకాలం సీజన్‌లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు ఉన్నట్టు చౌహాన్తెలిపారు. ఈ ధాన్యం సేకరణకు అన్ని జిల్లాల్లో కొత్త టెక్నాలజీతో కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో టార్పాలిన్లతో పాటు ఆటోమేటెడ్ ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సజావుగా కొనుగోళ్లు జరగాలని, ధాన్యం రవాణా, సేకరణలో లోపాలు ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. లారీలు, వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖకు, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఆపేందుకు నిఘా పెంచాలని పోలీసు శాఖకు సూచించారు.
మిల్లర్లు నిబంధనలు పాటించాల్సిందే
ధాన్యం సేకరణలో నిబంధనలను మిల్లర్లు కచ్చితంగా పాటించాలని చౌహాన్సూచించారు. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ధాన్యం అలాట్‌మెంట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ‘‘మిల్లర్ల పనితీరు ఆధారంగా మాత్రమే ధాన్యం కేటాయింపులు చేయాలి. సీఎంఆర్ డెలివరీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వెంటనే తరలించి మిల్లింగ్ పూర్తి చేయాలి’’ అని జిల్లా సప్లైస్ ఆఫీసర్ల(డీఎస్‌వో)ను ఆదేశించారు.
ధాన్యం సేకరణను విజయవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్, పోలీసు అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్, వేర్ హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.