
- ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించినందుకు సీఎంకు గుండేటి రాహుల్ కృతజ్ఞతలు
హనుమకొండ, వెలుగు: అనుకోని ఘటనలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ యువకుడికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక ఆర్టిఫిషియల్ లెగ్స్ అమర్చారు. దీంతో రెండు కాళ్లు కోల్పోయి తన జీవితం అయిపోయిందని నిరాశచెందిన బాధితుడు.. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 'సీఎం సార్.. మీ సాయం వల్లే మళ్లీ నడుస్తున్నా' అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన గుండేటి ఉమ, -మహేశ్ దంపతుల కొడుకు గుండేటి రాహుల్ ఐఐటీలో సీటు సాధించేందుకు శిక్షణ కోసం 2024 మార్చిలో రాజస్థాన్ లోని కోటాకు వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటూ సెలవుల నేపథ్యంలో అక్టోబర్ లో ఇంటికి వచ్చాడు. తిరిగి నవంబర్ 2న వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కోటాకు తిరుగు ప్రయాణం కాగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్ పై దాడి చేసి, ట్రైన్ నుంచి బయటకు తోసేశారు.
దీంతో తీవ్ర గాయాలపాలైన రాహుల్ రెండు కాళ్లు కోల్పోయాడు. పోలీసుల సమాచారంతో అక్కడికి వెళ్లిన రాహుల్ తండ్రి మహేశ్.. నేరుగా అతన్ని హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. తమకున్న ఎకరం భూమిని అమ్మేసి, రూ.30 లక్షలతో ట్రీట్మెంట్ చేయించి తన కొడుకును బతికించుకున్నాడు.
మంత్రి కొండా చొరవ.. సీఎం రేవంత్ రెడ్డి అండ
రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ ను ఎలాగైనా నడిపించాలని తండ్రి మహేశ్ ఎంతగానో తపనపడ్డాడు. తన కొడుకు పరిస్థితిని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ విషయాన్ని మంత్రి సురేఖ.. సీఎం రేవంత్ రెడ్డికి వివరించగా.. ఆయన చలించిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న రాహుల్ కు అధునాతన కృత్రిమ కాళ్లు అమర్చే ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాహుల్ ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలకు పైగా వెచ్చించి, అమెరికా నుంచి తెప్పించిన ఆధునిక కృత్రిమ కాళ్లను రాహుల్ కు అమర్చారు.
అనంతరం రాహుల్, తన పేరెంట్స్ తో కలిసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. రెండు కాళ్లు కోల్పోయిన తనకు మళ్లీ నడిచేలా సాయం చేసినందుకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ కు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, తొందర్లోనే రన్నింగ్ లెగ్స్ కూడా అమర్చేందుకు సీఎం హామీ ఇచ్చారని రాహుల్ తండ్రి మహేశ్ చెప్పారు. తమ కొడుకు మళ్లీ నడుస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.