
AI Shockwave on IT: కరోనా సమయంలో జాబ్ ఆఫర్ల వర్షం కురిపించాయి భారతీయ ఐటీ కంపెనీలు టెక్కీల పైన. కావాలన్నోళ్లకు వర్క్ ఫ్రం హోమ్ తో పాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా అందించాయి. అప్పట్లో టెక్కీలు చెప్పిందే యాజమాన్యాలు వినేవి. కట్ చేస్తే మూడేళ్లలో సీన్ మెుత్తం రివర్స్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఏఐ అన్ని రంగాల్లోకి రావటం కోడింగ్ నుంచి ప్రాజెక్ట్ డెలివరీల వరకు ఏఐ మానిటర్ చేయటంతో టెక్ పరిశ్రమలో పెను మార్పులు మెుదలయ్యాయి.
ప్రస్తుతం క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా టెక్ సంస్థలు కొత్త ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఏఐ తీసుకొస్తున్న మార్పులు డిజిటల్ ట్రాన్ఫర్మేషన్, క్లౌడ్ మైగ్రేషన్ వంటి గత మార్పులను మించిపోయాయి. డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ రాకతో 2000-2010 మధ్య 15వేల మంది మాత్రమే ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత 2012-18 మధ్య వచ్చిన క్లౌడ్ టెక్నాలజీ దాదాపు 70వేల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. వీటి తర్వాత సైబర్ సెక్యూరీటీ, డెవాప్స్ వంటి నైపుణ్యాలున్న టెక్కీలకు డిమాండ్ పెరిగింది.
కానీ ప్రస్తుతం ఏఐ అండ్ ఆటోమేషన్ కారణంగా ఈసారి లక్ష 25వేల మంది వరకు టెక్కీలు ప్రభావితం కానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. జనరేటివ్ ఏఐ, ఏఐ ఆటోమేషన్ వినియోగం పెరగటంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవటానికి లేఆఫ్స్ బాట పడుతున్నాయి. దీంతో డేటా సైన్టి్స్ట్, ఏఐ ఇంజనీర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో మ్యాన్యువల్ టెస్టింగ్, ఎల్ 1 సపోర్ట్, కోడింగ్ ఉద్యోగులకు ఎఫెక్ట్ ఉంటుందని తేలింది. అలాగే కంపెనీల్లో పనిచేస్తున్న మిడ్ లెవెల్ ఉద్యోగులకు కూడా ఏఐ ఎసరు పెడుతోంది.
ALSO READ : IT News: 15 నిమిషాల్లో రూ.6 వేల 500 కోట్లు నష్టపోయిన TCS : లేఆఫ్స్ దెబ్బకు షేకైన స్టాక్..
ఏఐ యుగంలో క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ ఇంజనీర్లు, క్లౌడ్ సెక్యూరిటీ, మల్టీ క్లౌడ్ కన్సల్టెంట్స్, ప్రామ్టింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ ఎథిసిస్ట్స్ అవసరం ఎక్కువైంది. దీనికి అనుగుణంగానే సంస్థలు కూడా తమ ఉద్యోగులను అప్ స్కిల్లింగ్ చేయటం కుదరని పక్షంలో లేఆఫ్ చేసి తమకు అవసరమైన ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల నియామకానికి వెళుతున్నాయి.
దిగ్గజ సంస్థల లేఆఫ్స్..
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో వస్తున్న మార్పులతో ఇంటెల్ 24వేల మందిని, టీసీఎస్ 12వేల మందిని, మైక్రోసాఫ్ట్ 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ వేతన పెంపులను పోస్ట్ పోన్ చేసింది. ఇక దేశంలో స్టార్టప్ కంపెనీలు హైరింగ్ ఫ్రీజ్ చేశాయి. దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక నెమ్మదించిన ప్రైవేటు రంగంతో యువత ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్న పరిస్థితులు భయాలను రేపుతున్నాయి.