
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. కేటీఆర్ తన ఇంటికి వచ్చాడని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య ఓట్ల శాతం కొంచమే తేడా ఉంటే.. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. మరీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాయా..? కేటీఆర్ గుండెపై చేయి వేసుకుని ఈ విషయాలపై సమాధానం చెప్పాలని సీతక్క చాలెంజ్ చేశారు.
బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం పెట్టుకుందని ఆరోపించారు. సీఎం రమేష్ కేటీఆర్ తనతో మాట్లాడిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అంటున్న కేటీఆర్ ఎందుకు రియాక్ట్ కావడం లేదని నిలదీశారు.
బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద ఆధారపడి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అభివృద్ధికి సహకరించాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని చురకలంటించారు.
ALSO READ : మరోసారి మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ.. 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయం
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో చెప్పాడని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ స్వయంగా తన ఇంటికి వచ్చి ఈ ప్రతిపాదన పెట్టాడని ఆయన పేర్కొ్న్నారు. దీంతో సీఎం రమేష్ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి. సీఎం రమేష్ చెప్పినట్లుగా.. కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారా..? వెళితే నిజంగానే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని ప్రతిపాదన పెట్టారా చెప్పాలని కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు.