ఆ కామెంట్ చేయడం వల్లే రాయుడిని పక్కనబెట్టారా.?

ఆ కామెంట్ చేయడం వల్లే రాయుడిని పక్కనబెట్టారా.?

వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌ సెలెక్షన్ టైమ్‌‌లో నాలుగో నంబర్‌‌ కోసం అంబటి రాయుడు, విజయ్‌‌ శంకర్‌‌ మధ్య తీవ్ర పోటీ నడిచింది. సీనియర్‌‌, స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ అయిన రాయుడిని కాదని.. ఆల్‌‌రౌండర్‌‌ శంకర్‌‌ను సెలెక్ట్‌‌ చేయడంపై విమర్శలు  వచ్చాయి. పైగా, మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లోనూ శంకర్‌‌ బ్యాటింగ్‌‌లో విఫలమయ్యాడు. అయినా.. కెప్టెన్‌‌ కోహ్లీ అతనికి బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంగ్లండ్‌‌తో మ్యాచ్‌‌లో కూడా అతను తుది జట్టులో ఉంటాడని చెప్పాడు. కానీ, గాయం తిరగబెట్టడంతో శంకర్‌‌ టోర్నీ నుంచి అర్ధంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగో నంబర్‌‌ కోసం వచ్చిన విజయ్‌‌ వైదొలగడంతో ఆ ప్లేస్‌‌ కోసం పోటీ పడిన తనను జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తే రాయుడుకు మళ్లీ నిరాశే ఎదురైంది.

స్టాండ్‌‌ బై లిస్ట్‌‌లో ఉన్న రాయుడును కాదని, వన్డే అనుభవమే లేని మయాంక్‌‌కు చాన్స్‌‌ ఇవ్వడాన్ని అతని ఫ్యాన్స్‌‌ తప్పుబడుతున్నారు. తెలుగు క్రికెటర్‌‌పై వివక్ష చూపుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్‌‌ టీమ్‌‌ ప్రకటించిన తర్వాత చీఫ్‌‌ సెలెక్టర్‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌ను ఎద్దేవా చేస్తూ ‘3డి గ్లాసెస్‌‌ కొన్నా’అని కామెంట్‌‌ చేయడం వల్లే రాయుడును మళ్లీ పక్కనబెట్టారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే, ప్రస్తుత టీమ్‌‌లో మిడిలార్డర్‌‌లో, ముఖ్యంగా నాలుగు నంబర్‌‌లో ఆడేందుకు పంత్‌‌తో పాటు దినేశ్‌‌ కార్తీక్‌‌ కూడా ఉన్నాడు. కానీ, ధవన్‌‌ వైదొలిగిన తర్వాత జట్టులో బ్యాకప్‌‌ ఓపెనర్‌‌ ఆప్షన్‌‌ లేకుండా పోయింది. వామప్‌‌తో పాటు తొలి మూడు మ్యాచ్‌‌ల్లో మిడిలార్డర్‌‌లో వచ్చిన లోకేశ్‌‌ ప్రస్తుతం రోహిత్‌‌తో కలిసి ఓపెనింగ్‌‌ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒకరు గాయపడితే ఇబ్బందులు తప్పవని భావించే మేనేజ్‌‌మెంట్‌‌ మరో ఓపెనర్‌‌ కావాలని కోరింది. ఒకవేళ తర్వాతి రెండు మ్యాచ్‌‌ల్లో రిషబ్‌‌ పంత్‌‌ విఫలమైతే లోకేశ్‌‌ను మళ్లీ నాలుగో నంబర్‌‌కు పంపి మయాంక్‌‌తో ఓపెనింగ్‌‌ చేయించే అవకాశం కూడా ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.