ఇద్దరు, ముగ్గుర్ని కనండి.. హిందూ జంటలకు అస్సాం సీఎం సూచన

ఇద్దరు, ముగ్గుర్ని కనండి.. హిందూ జంటలకు అస్సాం సీఎం సూచన

డిస్పూర్: అస్సాంలో జనాభా అంశంపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హిందువుల జనాభా తగ్గుతోందని.. మైనారిటీల జనాభా అమాంతం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హిందూ దంపతులు ఇకపై ఒక్క బిడ్డతో సరిపెట్టుకోకుండా.. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనాలని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉంటే.. హిందువుల జనాభా మాత్రం క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. దీంతో 2027 నాటికి అస్సాం జనాభా ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని.. బంగ్లాదేశీ మూలాలు ఉన్న ముస్లింల జనాభా 40 శాతానికి చేరుకుంటుందని లెక్కలతో సహా హెచ్చరించారు.  

రాష్ట్రంలో మారుతున్న జనాభా సమతుల్యత పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ.. హిందూ దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ‘‘హిందూ జనాభా నిష్పత్తి పడిపోతోంది. అందుకే హిందూ దంపతులు కనీసం ఇద్దరు, వీలైతే ముగ్గురు పిల్లలను కనాలని కోరుతున్నాను. హిందువులు జనాభాను పెంచుకోకపోతే.. భవిష్యత్తులో వారి ఇండ్లను చూసుకునే వారు కూడా ఉండరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

అదే సమయంలో ముస్లిం సోదరులు ఏడెనిమిది మంది పిల్లలను కనవద్దని కోరుతున్నామని.. కానీ, హిందువులు మాత్రం సంతానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. డిసెంబర్ 27న జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ ఆయన అస్సాంలో బంగ్లాదేశీ సంతతి జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.