చెరువుల పండుగ ఎట్లా చెయ్యాలే.. సర్పంచులు నిరసన 

చెరువుల పండుగ ఎట్లా చెయ్యాలే.. సర్పంచులు నిరసన 

మెదక్, వెలుగు: బతుకమ్మలు, బోనాల ఊరేగింపులతో పాటు నాన్ వెజ్ భోజనం పెట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే పైసలు సరిపోవని, సొంతంగా పైసలు ఖర్చు పెట్టడం తమ వల్ల కాదని సర్పంచులు తేల్చి చెప్పారు. బుధవారం హవేళీ ఘనపూర్‌‌లో చెరువుల పండగ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ 2018 పంచాయతీ రాజ్ చట్టంలో లేని పనులను కూడా తమతో చేయిస్తున్నారని వాపోయారు. ఇప్పటికే  చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కంటి వెలుగుకు పెట్టిన ఖర్చు పైసలు ఇంకా రాలేదని, చెరువుల పండుగ ఎలా చేయాలని అధికారులను నిలదీశారు.

ప్రభుత్వం చెప్పినట్లు చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సర్పంచులను కో ఆర్డినేషన్ చేయడమే తన బాధ్యతని, గ్రామ ప్రథమ పౌరులుగా  ప్రభుత్వ కార్యక్రమాలు సక్సెస్  చేయడం సర్పంచుల బాధ్యతని స్పష్టం చేశారు. ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయాలని, మరిన్ని నిధుల కోసం  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ , డీపీవోతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. దీంతో చెరువుల పండుగ నిర్వహణకు సంబంధించిన చెక్కులను కొందరు సర్పంచులు తీసుకున్నారు.