చట్ట ప్రకారం 300 గజాల జాగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

చట్ట ప్రకారం 300 గజాల జాగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
  • వాళ్లేం యాచకులు కాదు
  • ఫ్రీడం ఫైటర్​ల ఫ్యామిలీలకు 300 గజాల జాగా  
  • ఇవ్వాల్సిందేనని రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులకు చట్ట ప్రకారం ఇండ్ల జాగా ఇవ్వకపోవడంపై రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు మండిపడింది. వాళ్లను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడంపై ఫైర్ అయింది. వాళ్లేం యాచకులు కారని, చట్ట ప్రకారం 300 గజాల జాగా ఇవ్వాలని ఆదేశించింది. అదేం దానం చేస్తున్నట్లు కాదని పేర్కొంది. వరంగల్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు బైరోజు లక్ష్మయ్య భార్య చుల్కమ్మ వేసిన పిటిషన్ పై చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం మరోసారి విచారించింది. నెల రోజుల్లోగా ఆమెకు 300 గజాల జాగాను కేటాయించాలని తీర్పు చెప్పింది. సమరయోధుల కుటుంబాలకు సాగు భూమి లేదంటే 300 గజాల ఇండ్ల జాగా ఇవ్వాలని 1997లో ప్రభుత్వం జీవో 185 జారీ చేసింది. దీని ప్రకారం తనకు జాగా కేటాయించాలని చుల్కమ్మ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ 300 గజాల చొప్పున ఇచ్చిన ఆఫీసర్లు.. ఆమెకు 80 గజాలే ఇచ్చారు. దీంతో ఆమె రిట్‌‌ వేసి వాపస్‌‌ తీసుకుని మళ్లీ వేశారు. ఒకే అంశంపై రెండు రిట్లు వేయడాన్ని సింగిల్‌‌ జడ్జి తప్పు పట్టడంతోఆమె అప్పీల్ పిటిషన్ ఫైల్ చేశారు. 300 గజాలు ఇస్తామని హామీ ఇవ్వడంతోనే రిట్‌‌వాపస్‌‌ తీసుకున్నారని, కానీ అధికారులు ఇవ్వలేదని చుల్కమ్మ తరఫు లాయర్‌‌ కోర్టుకు తెలిపారు. . వరంగల్‌‌ జిల్లాలో 9 మందికి 300 గజాల చొప్పున ఇచ్చామని, స్థలం లేకపోవడంతో ఆమెకు ఇవ్వలేకపోయామని ప్రభుత్వ లాయర్‌‌ వాదించారు. నెల రోజుల్లోగా చుల్కమ్మకు జాగా ఇవ్వాలని వరంగల్‌‌ జిల్లా కలెక్టర్‌‌ను ఆదేశించింది.