ఆ ఊళ్లలో మల్లన్నసాగర్​ పనులు ఆపండి

ఆ ఊళ్లలో మల్లన్నసాగర్​ పనులు ఆపండి

సిద్దిపేట జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పనుల్ని వారం రోజులపాటు నిలిపివేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ నవీన్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పునరావాసం, పునఃనిర్మాణం (ఆర్ఆర్‌ ప్యాకేజీ) అమలు గురించి తొగుట గ్రామంలో ఇంటింటి సర్వే చేసి నివేదిక ఇవ్వాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని శుక్రవారం జరిగిన కేసు విచారణ సమయంలో లాయర్‌ చెప్పారు. తొగుట, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్‌ గ్రామాల్లో కరెంట్ స్తంభాల్ని కూడా తీసేస్తున్నారని, కరెంట్ ఆపేశారంటూ వాటికి చెందిన ఫొటోలను కూడా హైకోర్టుకు అందజేశారు. దీంతో ఆ నాలుగు గ్రామాల్లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పనుల్ని చేపట్టరాదని, వచ్చే వారం తిరిగి ఈ కేసును విచారించే వరకూ పనుల్ని ఆపేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కరెంట్ సరఫరా తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది. అయితే, అతికొద్ది మందికి మాత్రమే ఆర్ఆర్‌ ప్యాకేజీ అమలు కావాల్సి వుందని ప్రభుత్వ లాయర్‌ కోర్టుకు చెప్పారు. పునరావాస చర్యలు కొందరికి అందకపోయినా కుదరదని, కొద్ది మంది పేరుతో అందరినీ ఇక్కట్లకు గురిచేయరాదని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఆరోగ్యశ్రీపై పిల్​ కొట్టివేత

‘‘పైసా ఖర్చు లేకుండా ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందుతోంది. బెంగళూరులోనే వైద్య సేవలు బాగుంటాయి. అయితే హైదరాబాద్‌లో మరో అడుగు ముందుకేసి ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకంపై పిల్​(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)ను విచారించేది లేదు” అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆరోగ్య శ్రీ పథకంపై విచారణకు దాఖలైన ఓ పిల్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు కొట్టివేసింది.