హెచ్సీఏ నిధుల గోల్ మాల్ కేసులో అజారుద్దీన్ బెయిల్ పిటిషన్

హెచ్సీఏ నిధుల గోల్ మాల్ కేసులో  అజారుద్దీన్ బెయిల్ పిటిషన్

హెచ్ సీఏ నిధుల గోల్ మాల్  కేసులో హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్  మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.  టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్ధిన్ పై ఉప్పల్ పోలీసులు  నాలుగు కేసులు నమోదు  చేశారు. అప్పటి నుంచి అజారుద్దీన్  అజ్ఞాతంలోకి వెళ్లారు.

ఉప్పల్ స్టేడియంలో జిమ్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్​మెంట్లు, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో నిధుల గోల్​మాల్ జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో సునీల్.. ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2020–23 మధ్య టెండర్ల కేటాయింపుల్లో కోట్లలో అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌‌లో తేలింది. ఈ క్రమంలో పర్చేజింగ్ ప్యానెల్​లో ఉన్న అజారుద్దీన్, విజయానంద్​, సురేందర్ అగర్వాల్ తదితరుల​పై ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మార్కెట్​లో 392 రూపాయలు విలువ చేసే రెడ్​బాల్ ను 1,400 రూపాయలకు, 420 రూపాయలు విలువ చేసే వైట్​టెస్ట్ బాల్​ను 1,510 రూపాయలు పెట్టి కొన్నట్లు నిర్ధారణ అయింది. బాల్స్ కొనుగోళ్లలో మొత్తం రూ.57.07లక్షల అవినీతి జరిగినట్లు స్పష్టమైంది. అదేవిధంగా, రూ.177కే వచ్చే బకెట్ చైర్స్​కు ఏకంగా రూ.2,568 పెట్టారు. ఇందులో మొత్తం రూ.43.11 లక్షల అవినీతి జరిగినట్లు తేలింది. అదేవిధంగా, జిమ్ ఎక్విప్​మెంట్ కొనుగోళ్లలో రూ.1.50 కోట్లు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్​మెంట్ పర్చేజింగ్​లో రూ.1.34 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిట్​లో తేలింది.

నాలుగు వేర్వేరు ఫిర్యాదులు

హెచ్​సీఏకి అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న మూడేండ్ల కాలంలో నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలు వచ్చాయి. దాంతో అసోసియేషన్​ను గాడిలో పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు సింగిల్ మెంబర్ కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్​ చేయించగా, నిధుల గోల్​మాల్ వ్యవహారం బయటపడింది. కమిటీ ఆదేశాల మేరకు హెచ్​సీఏ సీఈవో ఉప్పల్ పోలీస్ స్టేషన్​లో నాలుగు వేర్వేరు ఫిర్యాదులు చేశారు. అజారుద్దీన్, విజయానంద్, సురేందర్​తో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ 406, 409, 420, 465, 467, 471, 20బీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.