PAK vs RSA: పాకిస్తాన్‌కు మరో బ్యాడ్ న్యూస్. తీవ్రంగా గాయపడ్డ షాదాబ్ ఖాన్

PAK vs RSA: పాకిస్తాన్‌కు మరో బ్యాడ్ న్యూస్. తీవ్రంగా గాయపడ్డ షాదాబ్ ఖాన్

వరుస ఓటములతో ఢీలా పడ్డ పాకిస్తాన్ జట్టుకు మరో చేదువార్త ఇది. ఆ జట్టు వైస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సఫారీ బ్యాటింగ్ తొలి ఓవర్‌లోనే అతడు గాయపడ్డాడు. కాసేపు అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు భయపడిపోయారు. దక్షణాఫ్రికా బ్యాటింగ్ తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. 

తొలి ఓవర్‌లో బవుమాను రనౌట్ చేసే ప్రయత్నంలో షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. వేగంగా విసిరే ప్రయత్నంలో బ్యాలెన్స్ అదుపుతప్పి నేలను బలంగా తాకాడు. దీంతో అతని తల నేలను కుదుపుకున్నట్లు అనిపించింది. కాసేపు అతని నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో  మైదానంలో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వెంటనే ఫిజియోలు స్ట్రెచర్‌తో పరుగెత్తారు. కొద్దిసేపటి అనంతరం షాదాబ్ లేచి నిలబడి మైదానం నుండి వెళ్లిపోయాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. తొలుత తడబడ్డా మిడిలార్డర్‌ రాణించడంతో సఫారీ బ్యాటర్ల ముందుపోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (65 బంతుల్లో 50, 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో పాటు సౌద్‌ షకీల్‌  (52 బంతుల్లో 52, 7 ఫోర్లు) ,  షాదాబ్‌ ఖాన్‌  (36 బంతుల్లో 43,  3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో తబ్రేజ్‌ షంషీ నాలుగు వికెట్లు తీసుకోగా.. జాన్సెన్‌కు మూడు వికెట్లు దక్కాయి.