HCA ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: జి.వినోద్

HCA ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: జి.వినోద్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హెచ్సీఏ మాజీ అధ్యక్షులు జీ. వినోద్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కొనసాగుతున్న హెచ్ సీఏ కమిటీ గడువు సెప్టెంబర్ 3వ తేదీతోనే ముగిసిందని తెలిపారు. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏజీఎంను కోరుతామన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హెచ్ సీఏ పర్యవేక్షణ కమిటీ భేటీ అయ్యిందన్నారు. ఉప్పల్ స్టేడియంలో క్లబ్ సెక్రటరీలు, హెచ్ సీఏ మాజీ అధ్యక్షులు, హెచ్ సిఏ మాజీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించామన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అత్యవసర జనరల్ బాడీ మీటింగ్ (ఏజీఎం) నిర్వహించి ఎన్నికలు వీలైనంత త్వరగా జరపాలని హెచ్ సిఏ పర్యవేక్షణ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. మూడేండ్లలో హెచ్ సీఏ భ్రష్టు పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలిసి ముందుకు రావాలని.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కకృ ఇచ్చే నివేదికపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. 

అజార్ హెచ్ సీఏను భ్రష్టు పట్టించారు : శివలాల్ యాదవ్

వీలైనంత త్వరగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని హెచ్ సిఏ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. అజార్ జనరల్ బాడీ మీటింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు అజార్ ఒక్క నివేదికను కూడా సమర్పించలేదని చెప్పారు. జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి హెచ్ సిఏ ఎన్నికలు జరపాలని కోరారు. అజార్ పూర్తిగా హెచ్ సిఏను అవినీతితో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. 

అజార్ నియంతలా వ్యవహరిస్తున్నారు : అర్షడ్ అయుభ్

అజార్ నియంతలా వ్యవహరిస్తున్నారని హెచ్ సీఏ మాజీ ప్రెసిడెంట్ అర్షడ్ అయుభ్ ఆరోపించారు. గడువు ముగిసినా ఇప్పటికీ అజార్ పరిపాలన వ్యవహారాల్లో తల దూరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రూల్స్ అనేవి ఎవరి కోసం పెట్టివే కాదు.. కానీ అజార్ మాత్రం అతడి కోసం హెచ్ సీఏ రూల్స్ పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరగకుండా అజార్ జోక్యం చేసుకుని వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.