హైదరాబాద్, వెలుగు: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లీజు గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆఫీస్ బేరర్లు కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామితో కలిసి వెళ్ళిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అమర్‌నాథ్, సెక్రటరీ ఎం. జీవన్ రెడ్డి, ట్రెజరర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బసవరాజు తదితరులు సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియం లీజు పొడిగింపు అంశంపై చర్చించారు. హెచ్‌సీఏ విజ్ఞప్తులను సావధానంగా విన్న సీఎం నిబంధనలు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ లీజు వ్యవహారాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి సీఎంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామికి హెచ్‌సీఏ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
