
- సెక్రటరీ దేవ్‌రాజ్, ట్రెజరర్ సీజే శ్రీనివాస్‌రావునూ అరెస్ట్ చేసిన సీఐడీ
- విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు
హైదరాబాద్, వెలుగు: హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) టికెట్ల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం అయింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ట్రెజరర్ సి. శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్ కాంటే, రాజేందర్ యాదవ్, జి. కవితను మంగళవారం అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో మరికొంత మంది అరెస్టులకూ రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ సందర్భంగా.. హెచ్‌సీఏ, -ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) మధ్య తలెత్తిన టికెట్ల వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంక్వైరీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి మే నెలలో ప్రభుత్వానికి నివేదిక అందించారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీఐడీని ఆదేశించగా, సీఐడీ అధికారులు గత నెలలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు..
టికెట్ల కోసం బెదిరింపులే కారణం
ఐపీఎల్ క్రికెట్ టీ ట్వంటీ టికెట్లు, ఫ్రీ పాసుల కేటాయింపులకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్ల కంటే పది శాతం అదనంగా ఇవ్వాలని హెచ్‌సీఏ ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వకపోవడంతో జగన్‌మోహన్‌రావు ఇబ్బందులకు గురి చేసినట్లు సీఐడీవిచారణలో వెలుగు చూసింది. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు కూడా తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆధారాలు సేకరించింది.
ఈ మేరకు హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మెయిల్స్ సహా అదనపు టికెట్ల కోసం హెచ్‌సీఏ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడిన అంశాలను ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధుల నుంచి రికార్డులు సేకరించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణతో పాటు, హెచ్‌సీఏ రోజువారీ కార్యకలాపాలు, స్టేడియం నిర్వహణ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం సీఐడీ సేకరించింది. పూర్తి డాక్యుమెంట్లతో సహా వివాదానికి గల కారణాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసి.. మరికొంత మందికి నోటీసులు ఇచ్చింది.