హెచ్‌‌‌‌సీఏ ఆఫీసులో సీఐడీ సోదాలు..ఉప్పల్ స్టేడియంలో నిందితుల విచారణ

హెచ్‌‌‌‌సీఏ ఆఫీసులో సీఐడీ సోదాలు..ఉప్పల్ స్టేడియంలో నిందితుల విచారణ
  • నిందితులను ఉప్పల్‌‌‌‌ స్టేడియానికి తరలించి విచారణ
  • అధ్యక్షుడు జగన్‌‌‌‌మోహన్ రావు సహా ట్రెజరర్, సీఈవోను ప్రశ్నించిన అధికారులు  
  • ఆఫీస్ రికార్డులు, కంప్యూటర్, మెయిల్స్ పరిశీలన 
  • జగన్‌‌‌‌మోహన్‌‌‌‌ రావు దాఖలు చేసిన ఫోర్జరీ పత్రాలపై ఆరా
  • మరో ఇద్దరు నిందితులు కవిత, రాజేందర్ యాదవ్‌‌‌‌నూ విచారించిన సీఐడీ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ)లో జరిగిన అవకతవకలపై జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రావును సీఐడీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆరు రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం రెండో రోజు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించారు. హెచ్‌‌‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌‌‌మోహన్ రావు, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస రావు, సీఈవో సునీల్‌‌‌‌ కాంటెలను ఉప్పల్ స్టేడియానికి తరలించి.. దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు.

స్టేడియం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ సహా చాంబర్లలో రికార్డులు పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేయడంతో పాటు ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నించి, వారి నుంచి వివరాలు సేకరించారు. అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమర్పించిన పత్రాలను ముందుంచి అందులోని ఫోర్జరీ సంతకాలు, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. అనుమానం ఉన్న రికార్డులను ఆఫీస్ బేరర్ల సమక్షంలో పరిశీలించారు. ఈ మేరకు సాక్షులుగా సంబంధిత సిబ్బంది నుంచి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లు తీసుకున్నారు.

ఫోర్జరీ సంతకాలపై ఆరా.. 

గౌలిపురా క్రికెట్‌‌‌‌‌‌‌‌ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌గా మార్చడంతో పాటు గౌలిపురా క్రికెట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌‌‌‌‌‌‌‌ సంతకం ఫోర్జరీపై జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌రావును సీఐడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శ్రీచక్ర క్రికెట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్ యాదవ్‌‌‌‌‌‌‌‌ను కూడా రెడ్‌‌‌‌‌‌‌‌ హిల్స్‌‌‌‌‌‌‌‌లోని సీఐడీ ఆఫీసులో విచారించారు. సంతకాలు ఫోర్జరీ చేసేందుకు ఎవరు ప్రలోభ పెట్టారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన పలు రికార్డుల ఆధారంగా నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ యాజమాన్యంతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ టికెట్ల అదనపు కోటా అంశంలో వివాదం తలెత్తిన సందర్భంగా ప్రభుత్వం విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ వేసిన విషయం తెలిసిందే. హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ అధ్యక్షుడిగా పలు సందర్భాల్లో జగన్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు ఇతర ఏజెన్సీలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈ-మెయిల్స్‌‌‌‌‌‌‌‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. ఈ కేసులో ఏ-3గా ఉన్న హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావును సైతం హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఆర్థిక అంశాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. హెచ్‌‌‌‌‌‌‌‌సీఏకు వివిధ మార్గాల్లో వచ్చే నిధులు, వాటి ఖర్చులు, క్రికెట్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు అవసరమైన వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సహా పలు అంశాలపై  శ్రీనివాసరావు నుంచి వివరాలు సేకరించారు.