
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంఎసీ) బుధవారం 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. ఇది సంస్థ ప్రకటించిన తొలి బోనస్ ఇష్యూ. నవంబర్ 26ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఆ తేదీకి షేర్లు కలిగిన వాటాదారులకు ఒక్క షేరుకు మరో బోనస్ షేరు లభిస్తుంది. ఇది కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను మార్చదు కానీ లిక్విడిటీ పెంచుతుంది. తద్వారా షేరు ధర తగ్గుతుంది. కంపెనీ రిజర్వుల నుంచి ఉచితంగా ఇచ్చే షేర్లని బోనస్ షేర్లు అంటారు.
బోనస్ షేర్ల ఇష్యూ ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి, గ్రోత్ సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఈ ఏడాది జులై– సెప్టెంబర్ (క్యూ2) క్వార్టర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి రూ.718.43 కోట్ల నికర లాభం వచ్చింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.576.61 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగింది. కంపెనీ ఆదాయం ఏడాది లెక్కన 16 శాతం పెరిగి రూ.1,027.40 కోట్లకు చేరింది. రిజల్ట్స్ మెప్పించడంతో కంపెనీ షేరు బుధవారం 3శాతం పెరిగి రూ.5,778కి చేరింది. గత 6 నెలల్లో 40శాతం లాభపడింది.