
న్యూఢిల్లీ: తమ పేరెంట్ కంపెనీ హెచ్డీఎఫ్సీలో విలీనం కావడానికి 8–10 నెలల వరకు పట్టొచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. రెండు సంస్థల విలీనానికి షేర్హోల్డర్ల అనుమతి కోసం శుక్రవారం జనరల్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ డీల్ విలువ 40 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. తాము విలీనం అవుతామని రెండు కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్లోనే ప్రకటించాయి. ఇందుకు 18 నెలల వరకు పడుతుందని అప్పట్లోనే చెప్పాయి. విలీన తేదీని ప్రకటించడానికి 8–10 నెలల సమయం అవసరమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ శశిధరన్ జగదీశన్ తాజాగా చెప్పారు. రెండూ కలవడం వల్ల కొత్త సంస్థ క్యాపిటల్ అడెక్వసీ రేషియో పెరుగుతుంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు డిపాజిట్లకు తగినట్టు క్యాష్రిజర్వుల రేషియో, లిక్విడిటీ ఉండాలి. ఈ విషయంలో ఆర్బీఐ ఏమైనా అభ్యంతరం తెలుపుతుందా అని షేర్హోల్డర్లు మేనేజ్మెంట్లను అడిగారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా అక్కర్లేదని, ఆర్బీఐతో చర్చించామని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్చెప్పారు. కొత్త సంస్థకు తగినంత లిక్విడిటీ ఉంటుందని, ఫండింగ్ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలూ ఉన్నాయని వివరించారు. ఇప్పుడున్న అన్ని హెచ్డీఎఫ్సీ సబ్సిడరీలు కొత్త సంస్థ సబ్సిడరీలుగానే ఉంటాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి చెప్పారు.