తల్లి కేసు వాదించడానికి లాయర్ సదివిండు

తల్లి కేసు వాదించడానికి లాయర్ సదివిండు

వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తల్లి కోసం లాయర్ గా మారాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన సులోచన కు వరంగల్ నగరానికి చెందిన పాము సోమయ్యతో 1971 లో వివాహం జరిగింది. సోమయ్య విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసేవాడు. వీళ్లకు ఇద్దరు కుమారులు శరత్ బాబు, రవి రాజా కిరణ్. సోమయ్య, సులోచన మధ్య మనస్పర్ధలు రావడంతో 1992లో విడిపోయారు. దీంతో పిల్లల పోషణ కోసం సులోచన కోర్టు మెట్లెక్కింది. కొన్నేళ్ల తర్వాత న్యాయం జరిగింది. కానీ, ఆ తీర్పు అమలు కాకుండా సోమయ్య అడ్డుపడ్డాడు. కోర్టు ఉత్తర్వులను వారికి అందకుండా చేశారు.

తల్లి పడుతున్న కష్టాన్ని చూసి..

అయితే ఇంటర్ లో ఉన్నప్పటి నుంచి శరత్ బాబు తల్లితో పాటు కోర్టు ఆఫీసులు, స్టోర్ రూమ్ ల చుట్టూ తిరిగేవాడు .తల్లి పడుతున్న కష్టాన్ని, ఆవేదనను చూసి బాధపడేవాడు. ఎలాగైనా తన కాళ్లపై తాను నిలబడి తల్లికి, తమ్ముడికి అండగా ఉండాలనుకున్నాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఎన్నో ఏళ్లుగా తల్లికి న్యాయం దక్కకపోవడంతో తానే లాయర్ కావాలనుకున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే లా పూర్తి చేశాడు. బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొని, తన తల్లి కేసునే మొదటిగా తీసుకున్నాడు.

అనేక అడ్డంకులు

పాతికేండ్ల నాటి కోర్టు తీర్పు కాపీ కోసం శరత్ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అనేక అడ్డంకులు ఎదురైయ్యాయి. చివరకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసి ఆ నాటి డాక్యూమెంట్స్ సంపాధించాడు. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల ప్రకారం భరణం అమలు తీర్పు వచ్చిన మూడేండ్లలోపే మళ్లీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. సాధారణ వివాహ చట్టం ప్రకారమైనా ఆ వ్యవధి పన్నెండేండ్లే ఉంటుంది. అయితే కర్ణాటకలో  కోర్టు తీర్పు ఆధారంగా శరత్ బాబు తన తల్లి కేసులో విజయం సాధించాడు. 30 ఏళ్ల తర్వాత తల్లికి ప్రతినెలా 30 వేల భరణం ఇచ్చేలా లోక్ అదాలత్ లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రెండు నెలలు సొమ్ము సులోచన ఖాతాలో జమైంది. ప్రస్తుతం శరత్ తండ్రి సోమయ్య పదవీ విరమణ పొందాడు.  

పిల్లల కోసం కోర్టు

ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాల మధ్య కన్నతల్లికి న్యాయం కోసం చిరవకూ తానే లాయర్ కావాల్సి వచ్చిందని శరత్ చెప్పాడు. తన లాంటి వాళ్లు ఎందరో సరైన న్యాయం జరగక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పిల్లల కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని సులోచన అన్నారు. అక్కడ న్యాయం జరిగినా, తీర్పు అమలు కాలేదన్నారు. తన పెద్ద కొడుకు శరత్ వకీలుగా కోర్టులో గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ సెక్టార్ నుంచి అడ్వకేట్ గా మారి తల్లికి న్యాయం జరిగేలా చేసి అన్నను చూసి గర్వపడుతున్నానని శరత్ తమ్ముడు రాజా రవికిరణ్ తెలిపారు. తోటి లాయర్లు శరత్ ను అభినందిస్తున్నారు.. తల్లీ కోసం న్యాయపోరాటం చేసి గెలిచిన శరత్ బాబు ఎందరికో  స్పూర్తి అని స్థానికులు అంటున్నారు.