మామిడి వ్యాపారంలో నష్టమొచ్చిందనిరౌడీ అవతారం

మామిడి వ్యాపారంలో నష్టమొచ్చిందనిరౌడీ అవతారం
  • మామిడి వ్యాపారంలో నష్టమొచ్చిందనిరౌడీ అవతారం
  • రియల్టర్లు, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు ప్లాన్ 
  • గన్ కొని అడవిలో ఫైరింగ్​ ప్రాక్టీస్​
  • నిందితుడిని అరెస్టు చేసిన జగిత్యాల పోలీసులు

జగిత్యాల, వెలుగు: మామిడి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని వక్రమార్గం పట్టాడు. మూఠాను ఏర్పాటు చేసి.. అక్రమ వసూళ్లకు పాల్పడాలని ప్లాన్ చేశాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ శివార్లలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడి దగ్గర గన్, బుల్లెట్లు దొరికాయని ఎస్పీ భాస్కర్ వెల్లడించారు. ‘‘ఐలాపూర్‌‌‌‌కు చెందిన సందరగిరి లక్ష్మీనర్సయ్య.. పండ్ల తోటలు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల అకాల వర్షాలకు మామిడి కాయలు రాలిపోవడంతో నష్టం వచ్చింది. 
దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని భావించిన అతడు.. బడా రియల్టర్స్, బిజినెస్ మ్యాన్స్, లీడర్లను గన్‌‌తో బెదిరిస్తూ డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశాడు. కోరుట్లకు చెందిన పాత నేరస్తుడు రాజు భాయ్ అలియాస్ గంగారాంను కలిశాడు. అతని ద్వారా ముంబైలోని నారాయణ, రమేశ్, పాటిల్, బిట్టులతో మాట్లాడాడు. ముఠాగా ఏర్పడేందుకు వారు ఒప్పుకోవడంతో గన్ కొనేందుకు సిద్ధమయ్యారు. వారికి లక్ష్మీనర్సయ్య ఫోన్ పే ద్వారా రూ.60 వేలు పంపగా ముంబైలో ఒక గన్, 4 రౌండ్ల బుల్లెట్లను కొని.. రహస్యంగా లక్ష్మీనర్సయ్యకు పంపారు. కోరుట్ల శివారులోని అటవీ ప్రాంతంలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశాడు” అని ఎస్పీ భాస్కర్ తెలిపారు. 

ఐదుగురి కోసం రంగంలోకి స్పెషల్‌‌ టీమ్స్‌‌

కోరుట్ల శివారులో పోలీసులు లక్ష్మీ నర్సయ్యను అదుపులోకి తీసుకున్నారు. గన్, బుల్లెట్లు, టూవీలర్, సెల్ ఫోన్ సీజ్ చేశారు. మిగిలిన ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. లక్ష్మీనర్సయ్యను రిమాండ్‌‌కు పంపారు. రాజు భాయ్, నారాయణ, రమేశ్, రాజు పాటిల్, బిట్టులపై కేసు నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. కేసును సాల్వ్​ చేసిన మెట్​పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి, కోరుట్ల సీఐ ప్రవీణ్, ఎస్ ఐ సతీశ్, సిబ్బందికి రివార్డులు ఇస్తామని ఎస్పీ చెప్పారు.