రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గుతున్నయ్​

రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గుతున్నయ్​
  •  నెలల తరబడి మూలకు పడేసే దుస్థితి ఉండదు: హరీశ్
  •  కోఠిలో ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌ యూనిట్ ప్రారంభం
  •  సెప్టెంబర్ నుంచి గర్భిణులకు న్యూట్రిషనల్ కిట్లు ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలోని డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్ రిపేర్లను త్వరితగతిన చేపట్టేందుకు ఉద్దేశించిన ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ కోఠిలోని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఆఫీస్ ప్రాంగణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. రిపేర్ల కారణంగా రూ.కోట్ల విలువైన యంత్రాలను నెలల తరబడి నిరూపయోగంగా ఉంచే దుస్థితి ఇకపై ఉండబోదని, ఎలాంటి రిపేరైనా ఒకట్రెండు రోజుల్లోనే చేయించి, ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రాష్ట్రంలో ఏ దవాఖానలోని యంత్రాలు రిపేర్‌‌కొచ్చినా, ఈ యూనిట్‌కు సమాచారం వస్తుందని తెలిపారు. ఇక్కడ కాల్ సెంటర్ ఉంటుందని, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ లేదా డాక్టర్లు ఎవరైనా 8888526666 నంబర్‌‌కు కాల్ చేసి మిషన్ రిపేర్‌‌కొచ్చిన విషయాన్ని తెలియజేస్తారని వివరించారు. ఎక్విప్‌మెంట్ రిపేర్ బాధ్యతలు చూసే సంస్థకు సమాచారాన్ని ఇచ్చి, ఒకట్రెండు రోజుల్లో పనులయ్యేలా కాల్‌ సెంటర్‌‌ సిబ్బంది చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ వివరాలన్నీ ఈ–ఉపకరణ్ అనే పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారన్నారు. ఈ పోర్టల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.

మందుల కొనుగోలుకు రూ.500 కోట్లు

రాష్ట్రంలో రూ.5 లక్షలకు మించి ఖరీదు చేసే యంత్రాలు 1,020 ఉన్నాయని, వీటి రిపేర్ల కోసం రూ.17 కోట్లు కేటాయించామని హరీశ్‌రావు వెల్లడించారు. మందుల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఇదివరకు 720 రకాల మందులే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 843 రకాల మందులు ఉంచుతున్నామని తెలిపారు. ఈ మందుల వివరాలను డాక్టర్లకు పాకెట్ డైరీ రూపంలో ప్రింట్ చేసి ఇస్తున్నామన్నారు. సర్కార్ దవాఖానకు వచ్చిన ప్రతి పేషెంట్‌కు అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేస్తున్నామని, డిశ్చార్జ్‌ సమయంలో డాక్టర్లు రాసే మందులను కూడా ఫ్రీగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మెడిసిన్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ ఈ–ఔషధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు.

ఒక్కో గర్భిణికి రెండు న్యూట్రిషనల్ కిట్లు

రాష్ట్రంలో గర్భిణులకు కేసీఆర్‌‌ న్యూట్రిషనల్ కిట్లను అందజేయాలని నిర్ణయించామని హరీశ్‌రావు వెల్లడించారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌, జోగులాంబ గద్వాల, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, ములుగు జిల్లాల్లో వచ్చే నెల నుంచి కిట్లు అందజేస్తామన్నారు. ఈ జిల్లాల్లో సుమారు లక్షన్నర మంది గర్భిణులు ఉన్నారని, ఒక్కొక్కరికి రెండు కిట్లు ఇస్తామని చెప్పారు. తొలి కిట్‌‌‌‌‌‌‌‌ను గర్భం దాల్చిన మూడో నెలలో, రెండో కిట్‌‌‌‌‌‌‌‌ను ఐదో నెలలో ఇవ్వనున్నట్లు వివరించారు. ఒక్కో కిట్‌‌‌‌‌‌‌‌లో కిలో న్యూట్రిషనల్ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిలో ఎండు ఖర్జూరం, అరకిలో నెయ్యి, మూడు బాటిళ్ల ఐరన్ టానిక్‌‌‌‌‌‌‌‌, ఒక అల్బెండజోల్‌‌‌‌‌‌‌‌ ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌ ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఈ వస్తువులను పెట్టుకునేందుకు ఒక ప్లాస్టిక్ బాక్స్ ఇస్తామన్నారు. కిట్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చే ఐదు వస్తువులకు రూ.1,580 ఖర్చవుతుందని ఆఫీసర్లు లెక్కగట్టారు. ఈ ఐదు వస్తువులను పెట్టుకునేందుకు ఇచ్చే బాస్కెట్‌‌‌‌‌‌‌‌ను ఒక్కో దాన్ని రూ.359 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 18 శాతం బాక్సుల కోసమే ఖర్చు చేస్తుండడంపై మంత్రిని ప్రశ్నించగా.. వస్తువులు పాడవకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సిజేరియన్లు తగ్గుతున్నయ్​

రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీల సంఖ్య తగ్గుతున్నదని మంత్రి చెప్పారు. గతేడాది ఆగస్ట్ నాటికి ప్రభుత్వ దవాఖాన్లలో 47 శాతం, ప్రైవేటులో 81 శాతం సిజేరియన్లు జరిగేవని, ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన్లలో 45 శాతం, ప్రైవేటు 75 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేసీఆర్‌‌ కిట్ పథకంతో ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీ చేయించుకునే వాళ్ల సంఖ్య పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 శాతం డెలివరీలు మాత్రమే సర్కారీ దవాఖాన్లలో జరిగితే, ఇప్పుడు ఏకంగా 66.8 శాతం జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

బూస్టర్ డోసులు సరఫరా చేస్తలే

బూస్టర్ డోసుకు అవసరమైన వ్యాక్సిన్ల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తాను 50 లక్షల కొవిషీల్డ్‌ డోసులు కావాలని లేఖ రాస్తే.. పది లక్షల డోసులు మాత్రమే పంపించిందన్నారు. మరో 3 లక్షల కొర్బెవాక్స్ డోసులు వచ్చాయన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని హరీశ్‌ విజ్ఞప్తి చేశారు.