వేడుకున్నా గాంధీలోకి పంపలేదు.. అంబులెన్స్ లోనే నా భార్య చనిపోయింది

వేడుకున్నా గాంధీలోకి పంపలేదు.. అంబులెన్స్ లోనే నా భార్య చనిపోయింది

సీపీ వద్ద హెడ్ కానిస్టేబుల్ ఆవేదన
హైదరాబాద్‌, వెలుగు: డ్యూటీలో తోటి పోలీసులు కణికరం చూపకపోడంతో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా నుంచి కోలుకున్న రాచకొండ పోలీసులకు మంగళవారం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన వెల్‌కమ్ కార్యక్రమంలో సీపీ మహేశ్‌భగవత్‌ ముందు గోడు వెల్లబోసుకున్నాడు. తుర్కపల్లిలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లతీఫ్(55) భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత నెల 27న మలక్‌పేట్‌లోని యశోద హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. లంగ్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆమెకు ఐసీయూ ఫెసిలిటీ అవసరమని, తమ దగ్గర బెడ్స్ లేవని చెప్పి పంపించేశారు.

గ్లోబల్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లినా, అడ్మిట్ చేసుకోకపోవడంతో అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. తను హెడ్‌ కానిస్టేబుల్‌ అని, తన భార్యకు సీరియస్ గా ఉందని చెప్పినా బందోబస్తులో ఉన్న పోలీసులు అనుమతించ లేదు. డ్యూటీలో ఉన్న ఓ ఇన్‌స్పెక్టర్‌‌కి సీపీ గారి రెఫరెన్స్‌ అని చెప్పినా పట్టిం చుకోలేదు. తన భార్యకు గాంధీలో వెంటిలేటర్ పెట్టించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా కనికరించలేదు. డీసీపీతో చెప్పించినా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి ఒంటి గంటకు అంబులెన్స్ ను వెనక్కి తిప్పి పంపడంతో కిలో మీటర్ దూరం వెళ్లేలోపే చనిపోయిందని ఆవేదన చెందాడు.