నక్సలైట్లను ప్రతిఘటించిన హెడ్ కానిస్టేబుల్కు ప్రమోషన్ సబబే: సుప్రీం

నక్సలైట్లను ప్రతిఘటించిన హెడ్ కానిస్టేబుల్కు ప్రమోషన్ సబబే: సుప్రీం
  • హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ డిస్మిస్

న్యూఢిల్లీ, వెలుగు: పోలీస్ స్టేషన్ పై నక్సలైట్ల దాడిని ధైర్యంగా ప్రతిఘటించి తిప్పికొట్టిన తెలంగాణకు చెందిన ఓ హెడ్‌‌ కానిస్టేబుల్‌‌కు ప్రమోషన్ సబబే అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనకు సత్వరమే పదోన్నతి కల్పించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌‌ను జస్టిస్‌‌ ప్రశాంత్‌‌ కుమార్‌‌ మిశ్రా, జస్టిస్‌‌ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. 1999 జనవరి 30 రాత్రి ఉమ్మడి ఏపీలోని ఓ పోలీస్‌‌ స్టేషన్‌‌పై నక్సల్స్ దాడి చేశారు.

అప్పుడు విధుల్లో ఉన్న పి.శ్రీనివాస్ అనే హెడ్‌‌ కానిస్టేబుల్ సహచరులతో కలిసి ఆ దాడిని ధైర్యంగా తిప్పికొట్టారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్న ఇతర పోలీసులకు ప్రభుత్వం సత్వర పదోన్నతి కల్పించి, శ్రీనివాస్‌‌ అప్లికేషన్ ను పక్కనపెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సింగిల్‌‌ బెంచ్‌‌, ఆ తర్వాత డివిజన్‌‌ బెంచ్‌‌ శ్రీనివాస్‌‌కు ప్రమోషన్ ఇవ్వాలని తీర్పు వెలువరించాయి. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆయన పాత్రను తక్కువగా చూడలేం..
నక్సలైట్ల దాడిని తిప్పికొట్టడంలో శ్రీనివాస్ ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిపినట్లు ధర్మాసనం గుర్తించింది. ముగ్గురు నక్సలైట్లను ఎదుర్కోవడంలో ఆయన పాత్రను తక్కువ చేసి చూడలేమని వ్యాఖ్యానించింది. తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టే పోలీస్ సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే సత్వర ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్థనీయమని పేర్కొంది. శ్రీనివాస్‌‌కు ప్రమోషన్ నిరాకరించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌‌ను తోసిపుచ్చింది.