హోంవర్క్ చేయలేదని హెడ్మాస్టర్ కొట్టడంతో.. బాలికకు పక్షవాతం

హోంవర్క్ చేయలేదని హెడ్మాస్టర్ కొట్టడంతో.. బాలికకు పక్షవాతం

హోంవర్క్‌ చేయలేదని బాలిక చెంపపై కొట్టడంతో.. బాలిక విసురుగా వెళ్లి తరగతి గోడకు తగిలింది.. చెయ్యి వంకరపోయింది.. బాలిక తల లోపల తీవ్ర గాయమవ్వడంతో చెయ్యి, మూతి వంకర్లు పోయి పక్షవాతం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
కాల్యాతండాకు చెందిన దారావత్‌ రమేశ్‌-రోజా దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె స్నేహిత పడమట నర్సాపురం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 18న తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టులకు సంబంధించి హోమ్‌వర్క్‌ చేయలేదని స్నేహితను ప్రధానోపాధ్యాయుడు బాణోత్‌ శంకర్‌ కొట్టారు. బాలిక విసురుగా వెళ్లి గోడకు తగిలి కింద పడిపోయింది. బడి నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె నీరసంగా ఉండటంతో తల్లి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఈనెల 20న బడికి వెళ్లమంటే వెళ్లకుండా ఇంటి సమీపంలోని రహదారి పక్కన కూర్చుండిపోయింది. బడికెందుకు వెళ్లడం లేదని తల్లి ప్రశ్నించగా తలనొప్పిగా ఉందని చెప్పింది. ఆ మరుసటి రోజు బాలిక చెయ్యి, మూతి వంకరపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు, అక్కడి నుంచి ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయగా తలలో దెబ్బతగలడంతో పక్షవాతం వచ్చిందని తేలింది. ఎవరైనా తలపై కొట్టారా అని స్నేహితను వైద్యుడు ప్రశ్నించడంతో హోమ్‌వర్క్‌ చేయలేదని ప్రధానోపాధ్యాయుడు కొట్టారని, ఎవరితో చెప్పొద్దని ఆయన బెదిరించడంతో తల్లికి కూడా చెప్పలేదని వెల్లడించింది. బడికి వెళ్లి కూతురిని ఎందుకు కొట్టారని తల్లి ప్రశ్నిస్తే సదరు ప్రధానోపాధ్యాయుడు తాను కొట్టలేదని, దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. తన కూతురును కొట్టిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారమే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఘటనపై విచారణ నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మకు నివేదిక అందిస్తానని ఎంఈవో వెంకట్‌ తెలిపారు. 
విద్యార్థిని స్నేహితను కొట్టలేదు
స్నేహితను తాను కొట్టలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాణోత్‌ శంకర్‌ వివరణ ఇచ్చారు. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం ఇంటి పని ఉండడంతో ఒక పూట సెలవు పెట్టి వెళ్లిపోయానన్నారు. తన కూతురు కూడా ఇదే పాఠశాలలో చదువుతోందని, స్నేహిత ఆడుకుంటూ వెళ్లి గోడకు తగిలినట్లు తనకు విద్యార్థులు చెప్పారన్నారు.