మార్చ్ 5 నుంచి హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్

మార్చ్ 5 నుంచి హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్
  • రెండేండ్లలో హెల్త్ అకౌంట్లు
  • టార్గెట్‌‌ పెట్టుకున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ!
  • కేంద్ర పథకంతో కలిపి అమలు
  • ఇంటింటికీ తిరిగి పది రకాల టెస్టులు
  • పేషెంట్ల నమోదుకు దవాఖాన్లలో హెల్ప్ డెస్క్‌‌లు
  • రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పైలట్ ప్రాజెక్ట్ షురూ

హైదరాబాద్, వెలుగు: నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండేండ్లలో హెల్త్ అకౌంట్లు, హెల్త్ ఐడీ నంబర్లు ఇవ్వాలని ఆరోగ్య శాఖ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హెల్త్ ప్రొఫైల్, కేంద్ర సర్కార్ తలపెట్టిన నేషనల్ హెల్త్ రికార్డ్స్‌ రెండూ ఒకేలా ఉండటం, రెండింటి లక్ష్యం ఒక్కటే కావడంతో రెండు కార్యక్రమాలను కలిపి అమలు చేయాలని యోచిస్తున్నది. ఈ నెల ఐదో తేదీ నుంచి హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ స్టార్ట్​ కానుంది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హెల్త్ అకౌంట్ల కోసం కేంద్రం తెచ్చిన పోర్టల్‌నే హెల్త్ ప్రొఫైల్ కోసం వాడుకోనున్నారు.

దవాఖాన్లలో హెల్ప్‌ డెస్కులు
హెల్త్ ప్రొఫైల్‌లో ఆఫీసర్లు క్రియేట్ చేసినట్టుగానే, కేంద్రం తెచ్చిన వెబ్‌సైట్ healthid.ndhm.gov.in లో సొంతగా ఎవరికి వారే హెల్త్ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫోన్ నంబర్‌‌, ఆధార్​తో హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మన వివరాలు ఎంటర్ చేయగానే ఆధార్‌‌ నంబర్‌‌ మాదిరిగానే, ఒక యూనిక్‌ నంబర్‌‌ను కేటాయిస్తారు. ఇదే మన హెల్త్ అకౌంట్ నంబర్ లేదా హెల్త్ ఐడీగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే, మన వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ఐడీ క్రియేట్ చేసి ఇస్తారు. ఇందుకోసం హాస్పిటళ్ల యాజమాన్యాలతో, డాక్టర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఒకసారి ఈ ఒప్పందం పూర్తయితే ప్రతి హాస్పిటల్‌లో హెల్త్ అకౌంట్ జనరేషన్ హెల్ప్‌ డెస్క్‌లు అందుబాటులోకి వస్తాయని హెల్త్ ఆఫీసర్‌‌ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ఓపీ నమోదు కోసం పేషెంట్ వచ్చిన వెంటనే హెల్త్ అకౌంట్ నంబర్ అడుగుతారని, అకౌంట్‌ లేకపోతే ఫోన్ నంబర్‌‌, ఏదైనా ఐడీ కార్డు తీసుకుని ఈ డెస్క్ వద్ద, అప్పటికప్పుడే అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారని చెప్పారు. డాక్టర్ కన్సల్టేషన్ వివరాల దగ్గరి నుంచి, టెస్టులు, డాక్టర్ సూచించిన మెడిసిన్ సహా అన్ని వివరాలు హాస్పిటల్ వాళ్లే సదరు వ్యక్తి అకౌంట్‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తారని తెలిపారు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి పాత రికార్డులు పట్టుకుపోయే తిప్పలు ఉండవని పేర్కొన్నారు.

మార్చి 5 నుంచి హెల్త్ ప్రొఫైల్
హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్‌‌ను ఈ నెల 5న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులో మంత్రి హరీశ్‌‌రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌‌‌‌ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారని హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌ఆర్డీలో సోమవారం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌రావు హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మూడు నెలల్లో పైలెట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఆఫీసర్లకు మంత్రి సూచించినట్టు తెలిసింది.