ఆరోగ్య శ్రీ గుడ్ న్యూస్ : జీవితాంతం ఫ్రీ మెడిసిన్‌‌

ఆరోగ్య శ్రీ గుడ్ న్యూస్ : జీవితాంతం ఫ్రీ మెడిసిన్‌‌

లివర్‌‌, గుండె మార్పిడి
పేషంట్లకు ప్రయోజనం

ఆరోగ్య శ్రీ ట్రస్టు బోర్డు
సమావేశంలో నిర్ణయం

మంత్రి ఈటల ఆధ్వర్యంలో
అధికారుల భేటీ

హైదరాబాద్‌‌, వెలుగు: లివర్‌‌, గుండె మార్పిడి చేయించుకున్న రోగులకు కిడ్నీ వ్యాధి బాధితుల తరహాలోనే జీవితాంతం ఉచితంగా మందులు అందజేయాలని ఆరోగ్య శ్రీ ట్రస్టు బోర్డు నిర్ణయించింది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థలసేమియా, సికిల్‌‌సెల్‌‌ ఎనీమియా బాధితులకు ఆరోగ్య శ్రీ కవరేజ్‌‌ లిమిట్‌‌ రూ.2 లక్షలు ఎత్తివేసి, వారికి అవసరమైన మేరకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ నెట్‌‌వర్క్‌‌ ఆస్పత్రులకు రూ.600 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు వివరించారు. బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆరోగ్య శ్రీలో ప్రస్తుతం 949 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఏయే వ్యాధులకు చికిత్స అందించాలనేది నిర్దారించేందుకు ఒక కమిటీని నియమించాలని అధికారులు సూచించగా మంత్రి అంగీకరించారు. కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులు, చికిత్సలు చేర్చే విషయమై ట్రస్ట్‌‌ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశముంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ట్రస్ట్‌‌ బోర్డు సమావేశానికి వచ్చిన ఈటల రాజేందర్‌‌కు ఆరోగ్య శ్రీ కార్యకలాపాలను అధికారులు వివరించారు.