వైద్యారోగ్య శాఖలో 20 వేల ఖాళీలు భర్తీ చేయబోతున్నాం

వైద్యారోగ్య శాఖలో 20 వేల ఖాళీలు భర్తీ చేయబోతున్నాం

కరోనా ప్రభావం తగ్గింది కానీ కరోనా అంతంకాలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘దేశవ్యాప్తంగా పిల్లలకిచ్చే ‘కోర్బీవ్యాక్స్’ హైదరాబాద్‎లో తయారుకావడం గర్వకారణం. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ 106 శాతం, సెకండ్ డోస్ 97 శాతం, 14 నుంచి 16 ఏళ్ల వరకు 87 శాతం పూర్తిచేసుకున్నాం. ఇప్పుడు 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నాం. పిల్లలు మైనర్లు కాబట్టి.. తల్లిదండ్రులే ముందుకొచ్చి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి. పిల్లలకు ఎప్పుడు 12 ఏండ్లు దాటితే అప్పుడు వ్యాక్సిన్ వేయించొచ్చు. అదేవిధంగా 60 ఏండ్లు దాటినోళ్లు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకొని అందరూ సురక్షితంగా ఉంటూ.. అందరూ ప్రభుత్వానికి సహకరించాలి. ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. దేశం మొత్తం మీద మన ఆశా వర్కర్లు మాత్రమే అత్యధిక జీతాలు అందుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైద్యారోగ్య శాఖలో 20 వేల ఖాళీలు భర్తీ చేయబోతున్నాం. ఆ ఖాళీల్లో కరోనా సమయంలో సేవలందించిన వారికి వెయిటేజీ ఇస్తాం. పీహెచ్‎సీల్లో డాక్టర్లు ఎక్కువైతున్నరు.. పేషంట్లు తక్కువైతున్నరు. డాక్టర్లు, ఆశా వర్కర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలకు సేవకులే. మంత్రిగా నేనైనా.. ఆశాగా మీరైనా సేవకులమే. ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి.. చాలా జిల్లాల్లో ఖాళీలున్నాయి.. అక్కడికి పంపిస్తాం. రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు 17 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ నెలరోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.