స్వస్థ్ నారీ కార్యక్రమంలో 20 లక్షల మందికి హెల్త్ టెస్టులు.. ప్రభుత్వ ఫ్రీ హెల్త్ క్యాంపులకు అనూహ్య స్పందన

స్వస్థ్ నారీ కార్యక్రమంలో 20 లక్షల మందికి హెల్త్ టెస్టులు.. ప్రభుత్వ ఫ్రీ హెల్త్ క్యాంపులకు అనూహ్య స్పందన
  • 16 రోజుల్లో 20.78లక్షల మందికి ఫ్రీగా వైద్య సేవలు, మెడిసిన్

హైదరాబాద్, వెలుగు: మహిళల్లో అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవగాహన కల్పించి, నివారణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం చేపట్టిన స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ 2025 హెల్త్ క్యాంపులకు రాష్ట్రంలో అనూహ్య స్పందన లభించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేది వరకు 16 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యాక్రమంలో 20లక్షల మంది మహిళలు, పురుషులు, పిల్లలు వైద్యసేవలు పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

సేవలు పొందిన వారిలో 14 లక్షలకు పైగా మహిళలే

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు మొదలు మెడికల్ కాలేజీల వరకు 5,065 స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహించారు. అలాగే, 41,153 స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకో మెగా క్యాంప్ చొప్పున 33 జిల్లాల్లో ఏర్పాటు చేసి.. స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించారు. ఈ క్యాంపుల నిర్వహణ సమయంలోనే బతుకమ్మ, దసరా వంటి పండుగలు వచ్చినప్పటికీ మొత్తం 20,78,284 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు.

స్పెషలిస్టు వైద్య సేవలు, మెడిసిన్

ఈ ఫ్రీ హెల్త్ క్యాంపుల ద్వారా 14 లక్షలకు పైగా మహిళలకు వివిధ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు, స్పెషలిస్ట్ వైద్య సేవలు, మెడిసిన్ కూడా అందించారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, టీబీ, సికిల్ సెల్ డిసీస్, డయాబెటీస్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఎనీమియాకు కూడా స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించారు. వీటితో పాటు గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, డెంటల్, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించారు. మదర్ అండ్ చైల్డ్ కేర్ కు సంబంధించి కార్డులు కూడా పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్సీడీ సేవలు సైతం

స్పెషలిస్టు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్​(ఎన్సీడీ) సేవలు కూడా అందుబాటులో ఉండటంతో మహిళలతోపాటు పురుషులు కూడా పెద్ద సంఖ్యలో దీన్ని వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 6 లక్షల మంది మేల్స్ ఈ క్యాంపుల ద్వారా వైద్య సేవలు పొందినట్లు చెబుతున్నారు. అలాగే, డయాబెటీస్, బీపీ వంటి ఎన్సీడీ వ్యాధులను ముందుగానే గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహించారు.