ఇమ్యూనిటీ కోసం మిల్లెట్స్ మస్తు తింటున్నరు..చిరుధాన్యాల అమ్మకాలు డబుల్

V6 Velugu Posted on May 03, 2021

  • సెకండ్ వేవ్​తో సిటీజనాల్లో పెరిగిన సెల్ఫ్ అవేర్ నెస్
  • ఇమ్యూనిటీని పెంచే ఫుడ్​ పై ఫోకస్
  • స్టార్టప్స్ కోసం న్యూట్రిహబ్​కు అప్లికేషన్ల వెల్లువ

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్​తో సిటీ జనాల్లో ఆరోగ్యానికి సంబంధించి సెల్ఫ్​ అవేర్ నెస్ మరింతగా పెరుగింది. గతేడాది కరోనా, లాక్ డౌన్ నుంచే సిటిజన్లు ఇమ్యూనిటీని పెంచే ఫుడ్​పై ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు. డైలీ మీల్స్​లో న్యూట్రిషనల్ ఫుడ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకున్నారు.  ఇందులో భాగంగానే మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తినడాన్ని ఎక్కువమంది అలవాటు చేసుకున్నారు. గతేడాది నుంచి మిల్లెట్స్​కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో  కొందరు మిల్లెట్ స్టార్టప్స్​ను ప్రారంభించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  గతేడాది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(ఐఐఎంఆర్)లోని న్యూట్రిహబ్​కి 215అప్లికేషన్ రాగా, ఈ ఏడాది ఒకటిన్నర రెట్లు పెరిగిందని  న్యూట్రి హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. దయాకర్ రావు తెలిపారు. కరోనాతో జనాల ఫుడ్ హ్యాబిట్స్ మారి మిల్లెట్స్​ను ఎక్కువగా తింటున్నారని..అందువల్లే ఎక్కువ సంఖ్యలో నయా స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయని ఆయన చెప్తున్నారు.  మిల్లెట్ స్టార్టప్స్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఐఐఎంఆర్   రెండునెలల పాటు అన్ని అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారికి స్టార్టప్ మొదలుపెట్టడానికి ఫండింగ్ కూడా అందిస్తోంది. కరోనా కారణంగా మూడేళ్లలో జరగాల్సిన వ్యాపారం 6 నెలల్లోనే అవుతోందని మిల్లెట్స్ స్టోర్   రన్ చేస్తున్న నిర్వాహకులు అంటున్నారు.
హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచనలతో..
గతేడాది లాక్ డౌన్ టైమ్ నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి సిటీలో డిమాండ్ పెరిగింది. ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, న్యూట్రిషినల్ ఫుడ్​ను సిటీ జనం తప్పనిసరిగా ఫాలో అవుతున్నారు. వీటిలో ముఖ్యంగా అండుకొర్రలు, సామలు, ఉదలు, అరికెలు, సజ్జలు లాంటి మిల్లెట్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులల్లో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు మిల్లెట్స్​ను ఎక్కువగా తింటున్నారు. మరోవైపు కాల్షియం ఎక్కువగా ఉండే రాగులు, పాస్పరస్ అధికంగా ఉండే సజ్జలను డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే గతేడాది నుంచి 35 నుంచి 50శాతం బిజినెస్ పెరిగిందని మిల్లెట్ స్టోర్ల ఓనర్లు అంటున్నారు. ప్రతిరోజు చిరుధాన్యాల వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడానికి 10 నుంచి 15 వరకు ఎంక్వయిరీ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. గతంలో స్టోర్ కి నెలకు కింటా సరుకు తెప్పించేవాళ్లమని.. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ దృష్ట్యా రెండు క్వింటాళ్లను తెచ్చిపెట్టుకుంటున్నామని అంటున్నారు. ఆన్​లైన్ డోర్ డెలివరీ చేసుకునే 
వారితో పాటు స్టోర్​కి డైరెక్ట్​గా వచ్చే వారి సంఖ్య పెరిగిందంటున్నారు.

స్టార్టప్ పెట్టాలనుకునే వారికి ట్రైనింగ్ 
కరోనా కారణంగా మిల్లెట్స్​కు డిమాండ్ పెరగడంతో చాలామంది ఈ బిజినెస్​లోకి ఎంటర్ అవుతున్నారు. మిల్లెట్ స్టార్టప్ పెట్టుకునేందుకు  ఐఐఎంఆర్​కి చెందిన న్యూట్రిహబ్ ని సంప్రదిస్తున్నారు. ఈ న్యూట్రిహబ్ ద్వారా కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకునేవారికి అన్ని రకాల అంశాలపై 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తుంటారు. ప్రతి 2 నెలలకో బ్యాచ్​కి ట్రైనింగ్ ఇచ్చి అందులో 40 మందికి పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ ఏడాది 4వ బ్యాచ్​లో  మిల్లెట్ స్టార్టప్ కోసం 108 అప్లికేషన్లు రాగా..వాటిని ఫిల్టర్ చేసి 54 మందికి సెలక్ట్ చేశామని న్యూట్రి హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. దయాకర్ రావు తెలిపారు. ఈ 54 మందికి వర్చువల్​గా ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. వీరిలో 40 మందిని ఫైనలైజ్ చేసి వారి స్టార్టప్ కి సంబంధించి  ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి మిల్లెట్స్, వాటి మార్కెటింగ్ పై అవేర్ నెస్ కల్పిస్తారు. రైతులతో ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తారు. ప్రొడక్ట్ ను మార్కెట్​లోని ఎలా తీసుకెళ్లాలనే విషయాలను నేర్పిస్తారు. తర్వాత స్టార్టప్ కోసం రూ.5 లక్షల సాయం అందిస్తారు. ఇప్పటి వరకు 40 మందికి రూ.3 కోట్ల 40 లక్షలు ఫండ్స్ శాంక్షన్ అయ్యాయని దయాకర్ రావు తెలిపారు. 

సాఫ్ట్ వేర్ నుంచి మిల్లెట్స్ బిజినెస్ కు
మా ఫ్యామిలీలో అందరూ మిల్లెట్స్ తింటారు. నాకూ అదే అలవాటైంది. నేను ఐటీ జాబ్ కోసం బెంగుళూరు వెళ్లినప్పుడు అక్కడ అందరూ వారి ఫుడ్ లో మిల్లెట్స్  తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడాన్ని గమనించా.  మిల్లెట్స్ బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్టుతో నేను సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి బెంగుళూర్ లో మా ఫ్రెండ్​తో కలిసి రెండు స్టోర్స్ ఓపెన్ చేశా.  చిరుధాన్యాలు ఎక్కువగా పండించే చిత్తూరు, అనంతపురం, కడప ,ఉతర్త కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని రైతులతో టై అప్ అయ్యాం.  వారు కేవంల మిల్లెట్స్ మాత్రమే పండిస్తారు. అక్కడే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఓపెన్ చేశాం.అక్కడి నుంచి నేరుగా స్టోర్​కి మిల్లెట్స్ వస్తాయి. బెంగుళూరులో బిజినెస్ సక్సెస్ కావడంతో 2019లో హైదరాబాద్​లోని సంతోశ్​నగర్​లో మరో స్టోర్ ఓపెన్ చేశా. లాక్ డౌన్, కరోనాతో మేం ఊహించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ బిజినెస్ జరిగింది. రెగ్యులర్ కస్టమర్లకు డోర్ డెలివరీ ఫెసిలిటీ కల్పిస్తున్నాం.  - జంగయ్య, అనిక మిల్లెట్స్ స్టోర్ ఓనర్ , సంతోశ్​నగర్

సపోర్ట్ గా ఉంటున్నం 
మిల్లెట్స్ బిజినెస్​పై ఇంట్రెస్ట్ ఉన్న వారి  స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించ డానికి ప్రత్యేకమైన ఇంక్యుబేటర్ అయిన న్యూట్రిహబ్ 2016లో ఏర్పాటైంది.  సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని  నిధి ప్రాజెక్ట్ నుండి న్యూట్రిహబ్​కు నిధులు వస్తుంటాయి. గతేడాదితో పోలిస్తే నూట్రిహబ్​కు వచ్చే అప్లికేషన్ల సంఖ్య ఒకటిన్నర రెట్లు అప్లికేషన్లు పెరిగింది. ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్, మహిళలు, ఐటీ సెక్టార్, బిజినెస్ స్కూల్స్ నుంచి అప్లికేషన్స్ వస్తున్నాయి.  మంచి ఐడియాతో వచ్చేవారికి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. ఐడియా నుంచి కమర్షియల్​గా బిజినెస్ స్టార్ట్ చేసే వరకు అన్ని స్టేజీల్లో హెల్ప్​​ఫుల్​గా ఉంటాం. మార్కెటింగ్ గురించి, ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాలనే విషయాలను చెప్తాం. రెండునెలల ట్రైనింగ్ తర్వాత వారిని కమిటీ ముందు ఉంచుతాం. అందులో ఫైనలైజ్ అయినవారికి  రూ. 5 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఫండింగ్ ఉంటుంది. జూన్​లో ఇంకో బ్యాచ్ మొదలుపెట్టబోతున్నాం. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ ఎండింగ్​లో ఉంది. - డి. దయాకర్ రావు, చీఫ్​ ఎగ్జిక్యూటి ఆఫీసర్ న్యూట్రిహబ్, సీనియర్ సైంటిస్ట్, ఐఐఎంఆర్

Tagged health experts, good health, healthy diet, , diet habbits, health and beauty, millets eating, improve immunity, cereals sales, IIMR scientists suggetions, dietitian advices

Latest Videos

Subscribe Now

More News