ఈ ప్రపంచంలో అతి పదునైనది ఏంటో తెలుసా?

ఈ ప్రపంచంలో అతి పదునైనది ఏంటో తెలుసా?

ఒకరోజు శిష్యులంతా గౌతమ బుద్ధుడి దగ్గర కూర్చున్నారు. అప్పుడు గౌతమ బుద్ధుడు.. ‘‘ఇప్పటివరకు మీకు ఎన్నో కథలు చెప్పాను. నీతి శాస్ర్త పాఠాల్ని నేర్పించాను. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బాగా ఆలోచించి వాటికి సమాధానం చెప్పండి’’ అన్నాడు.  శిష్యులందరిలో ఏం ప్రశ్న అడగబోతున్నాడన్న ఉత్కంఠ. అంతలోనే ‘ఈ ప్రపంచంలో అతి పదునైనది ఏది?’  అని అడిగాడు బుద్ధుడు.  అందుకు శిష్యులంతా వాళ్లలో వాళ్లు మాట్లాడుకొని ‘ఖడ్గం’ అని కూడబలుక్కొని చెప్పారు. అందుకు బుద్ధుడు చిన్నగా నవ్వి... ‘‘శిష్యులారా! ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పదునైనది నాలుక. అది ఎటువంటి రక్తం చిందించకుండానే.. ఎదుటి వాళ్ల మనసుల్లో లోతైన గాయం చేయగలదు’’ అని చెప్పాడు. 

అవును  బుద్ధుడు చెప్పింది నిజమే..ఖడ్గం కన్నా పదునైనది నాలుక. అలాగే మనిషికి ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద శత్రువు కూడా నాలుకే.  కానీ, ఈ విషయాన్ని ఒప్పుకోకుండా .. ‘మీకు అన్నింటికన్నా పెద్ద శత్రువు ఎవరు?’ అని ఎవరిని అడిగినా కచ్చితంగా ఒకరి పేరు చెప్తుంటారు. కానీ, నిజానికి మనిషికి అన్నింటికన్నా పెద్ద శత్రువు వాళ్ల మాట తీరే. ఇది ఎంత హాని చేస్తుందంటే. తమ అనుకున్న వాళ్లందర్నీ దూరం చేస్తుంది. అప్పటివరకు ఉన్న సంతోషాలు అన్నింటినీ పట్టుకెళ్తుంది. అవకాశాల్ని, అర్హతల్ని లాక్కుంటుంది. పతనానికి కారణం అవుతుంది.. అన్నింటికన్నా ముఖ్యంగా చుట్టూ ఎంతమంది ఉన్నా  మనల్ని ఒంటరిగా నిలబెడుతుంది. నలుగురిలో చులకన చేస్తుంది. అసహ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు చెప్పండి దీనికన్నా పెద్ద శత్రువు ఇంకొకటి ఉంటుందా?  కనిపించే శత్రువుతో అలుపు లేకుండా పోరాడుతుంటాం కదా! మరి ఈ కనిపించని శత్రువు గురించి ఏంటి? మనం ఎలా ఈ శత్రువుని ఓడించగలుగుతాం? దీనికి సమాధానం సహనమే.

మాట తీరు బాగుంటే ..
ఎక్కడ మనిషి  మాటలు మనిషిని  జయించవో.. అక్కడ ఆ మాటలు మనిషిపై ఎదురుదాడి చేస్తాయి. మన మాటలపై మనకే అదుపు లేనప్పుడు అవే మనల్ని ఇరకాటంలోకి నెట్టేస్తాయి. మూర్ఖత్వం వల్ల వచ్చే కొన్ని మాటలు  మనకే నష్టాన్ని కలిగిస్తాయి. దు:ఖాన్ని మిగులుస్తాయి. పశ్చాత్తాప అంచుల వరకు తీసుకెళ్తాయి. ఆ మాటల ఉద్దేశం సరైనది అయినా ... కాకపోయినా కూడా... ఆ మాటల పరధ్యానం వల్ల ఎదుటివాళ్ల మనసుకి లోతైన  గాయం అవుతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా, ఎదుటివాళ్లని క్షమాపణ అడిగినా వాళ్లకి కలిగిన ఆ బాధ తీరిపోదు. ఆ మాటలు వాళ్ల మనసు లోతుల్లో ఉండిపోతాయి. వాళ్ల దృష్టిలో మనల్ని హీనంగా చూపెడతాయి. అందుకే  మాటల శక్తిని అర్థం చేసుకోవాలి. వాటి ప్రాముఖ్యతని అర్థం చేసుకోవాలి. నాలుకని అదుపులో పెట్టుకోవాలి. మాట తీరుని సరిచేసుకోవాలి. మాట తీరు బాగుంటే ప్రపంచమంతా బాగున్నట్టు కనిపిస్తుంది. మరి ఆ మాటల్ని ఎలా సరిచేసుకోవాలంటే...

తక్కువ మాట్లాడాలి.. 
ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా! మనందరికీ రెండు కళ్లు ఉంటాయి. రెండు చెవులు ఉంటాయి. రెండు కాళ్లు, రెండు చేతులు కూడా ఉంటాయి. కానీ, నోరు  ఒక్కటే ఉంటుంది. నాలుక కూడా కేవలం ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే.. మనం ఎక్కువగా చూడాలి. ఎక్కువగా వినాలి. ఎక్కువగా పనులు చేయాలి.  కానీ,  తక్కువ మాట్లాడాలి అని. అలాగే మన నాలుక కూడా చాలా సెన్సిటివ్​గా ఉంటుంది. ఎందుకంటే దానిలాగే మనం మాట్లాడే పదాలు, మన మాటతీరు కూడా సున్నితంగా ఉండాలని. ఒకవేళ నోటితో పదాలు కఠినంగా వస్తే.. ఇక దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. అందుకే మాట్లాడే మాటలు కూడా ఎదుటి వాళ్లని నొప్పించకుండా సున్నితంగా ఉండాలి. ఎదుటివాళ్లని ఎగతాళి చేస్తూ వ్యంగ్యపు మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు.

మాట్లాడేముందు..
కొన్నిసార్లు మన మాటలు అన్నింటికన్నా ముందే మనల్నే కాల్చేస్తాయి. అందుకే ఏ విషయం గురించైనా సరే... మాట్లాడేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఆ మాటలు సరైనవే అయినప్పటికీ వాటిని ఎదుటి వాళ్లు ఎలా తీసుకుంటారు అన్నది కూడా ఆలోచించాలి. అలాగే ఎవరికైనా  ఏదైనా చెప్పాలనుకుంటే ఎలాంటి పదాల్ని వాడుతున్నామన్నదే ముఖ్యం. జీవితంలో ఎప్పుడూ ఒకరిని తక్కువ చేయడానికి మాటల్ని ఆయుధంగా చేసుకోకూడదు.  అన్నింటికన్నా ముఖ్యంగా జీవితంలో ఎప్పుడూ  మంచి మాటలే మాట్లాడాలి. అలాగే మాటల్ని స్థిరంగా ఉంచుకోవాలి. అలాగే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అర్థవంతంగా ఉండాలి. అవి కచ్చితంగా మన విలువని పెంచేవై ఉండాలి. అప్పుడే అందరూ మనల్ని ప్రేమిస్తారు. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది.
::: మానసి