బీసీ రిజర్వేషన్ల జీవోపై ఇవాళ (అక్టోబరర్ 06) సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ

 బీసీ రిజర్వేషన్ల జీవోపై ఇవాళ (అక్టోబరర్ 06) సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ
  • బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ
  • సీనియర్‌‌ అడ్వకేట్లతో కీలక భేటీ..     
  • ఫోన్‌లో చర్చించిన రేవంత్‌రెడ్డి
  • అంతకుముందు తాజా పరిస్థితులను 
  • సీఎంకు  వివరించిన భట్టి, పొన్నం 

హైదరాబాద్, వెలుగు: 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను  42 శాతానికి పెంచుతూ  రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నెం. 9పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనున్నది. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనున్నది.  తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించనున్నారు. 

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును ఈ విచారణ తేల్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పెరిగిన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న లక్ష్యంతో తమ వాదనలు వినిపించి కేసు గెలిచేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తున్నది. 

ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి చిక్కులు లేకుండా కేసును పరిష్కరించాలని, ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లిందనే అంశాలను ఆధారాలతోసహా నివేదించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్‌తో కూడిన బృందం ఢిల్లీకి పయనమైంది.  వారు అక్కడ సీనియర్ న్యాయవాదులను కలిసి, కేసులో వాదనల వ్యూహాలపై చర్చించారు. ఢిల్లీలోని న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్‌ దవేతో సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, లోకల్ బాడీ ఎలక్షన్స్‌ నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, జీవో 9ని తీసుకురావాల్సిన ఆవశ్యకత, ఇతర అంశాలపై చర్చించారు.  

జీవో 9పై వివరణ..

రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారాలతోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతూ గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో ప్రత్యేకంగా ఆర్టికల్​ 40 ప్రకారం ‘స్థానిక పాలన’ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొన్నది. ఈ అంశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నది.   పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి  రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీ(6),  ఆర్టికల్ 243 టీ(6)  రెండు నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసన సభలకు కల్పిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్​తెగల (ఎస్టీ)కు మాత్రమే  కాకుండా.. బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అధికారం ఈ ఆర్టికల్స్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిందని, వీటి ప్రకారమే జీవో ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించనున్నది.  

అయితే, ప్రధానంగా పంచాయతీరాజ్​ చట్టం 285(ఏ) మీద కాస్త సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం ఎత్తివేస్తూ చేసిన ఈ చట్ట సవరణ ఇంకా గవర్నర్​ దగ్గరే పెండింగ్‌లో ఉన్నది. గవర్నర్​ దగ్గర ఒక బిల్లు పెండింగ్‌లో ఉండగానే జీవో ఇవ్వడం ద్వారా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావొచ్చా? అనేది కీలకంగా మారింది. గతంలో ఇలాంటి జీవోలు ఏమైనా ఇచ్చారా ? ఇస్తే ఏ రకంగా అమలు చేశారు? అనేది కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. 

బలంగా వినిపించాలనుకుంటున్నవి ఇవే

    రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దు. కానీ, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్​) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% సీలింగ్‌ను దాటి అమల్లో ఉంది. ఈ విధంగా, సుప్రీంకోర్టు రూలింగ్ అమల్లో లేదని ప్రభుత్వం వాదించనున్నది.

    కృష్ణమూర్తి వర్సెస్​ సుప్రీంకోర్టులాంటి గత తీర్పుల్లో  కోర్టు పేర్కొన్న విధంగా.. ప్రత్యేక సందర్భంలో ఎంపిరికల్ డేటా  ఆధారంగా  రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయనున్నది.

    గత ఏడాది  నవంబర్‌‌లో దాదాపు 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌‌వైజర్లతో  దాదాపు రెండు నెలల పాటు సమగ్ర ఇంటింటి సర్వే  జరిపామని, మొత్తం కోటి 12 లక్షల 15 వేల 134 కుటుంబాల నుంచి 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది వివరాలు సేకరించినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలుపనున్నది. ఒక్కో కుటుంబం నుంచి కులంతోపాటు విద్య, ఆదాయం, వృత్తి, రాజకీయ భాగస్వామ్యంలాంటి 75 కీలక అంశాలపై సమాచారం రికార్డు చేసి .. తెలంగాణలో బీసీల రాజకీయ ప్రాతినిథ్యంలో ఉన్న గ్యాప్‌ను అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని వెల్లడించనున్నది.  ఇది పూర్తిగా బీసీల సామాజిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న చట్టబద్ధమైన నిర్ణయమని ప్రభుత్వం గట్టిగా వాదించనున్నది.

    ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్‌‌కు పంపింది. గవర్నర్​ దానిని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం అవి అమలవుతున్నాయి. ఆ తరహాలోనే బీసీలకు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో  ఉండగా జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేయనున్నది. 

అటు హైకోర్టులో కొనసాగుతున్న విచారణ..

 జీవో-9 అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. హైకోర్టు కూడా రిజర్వేషన్ల పెంపు బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వం జీవో ఇవ్వడంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ  జీవోపై తుది నిర్ణయం హైకోర్టు విచారణ తర్వాతే ఉంటుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసు విచారణ చేపడుతుందా? లేదా హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దానికి అనుగుణంగా విచారిస్తామని చెబుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.  

ఢిల్లీలో కీలక భేటీ..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.  తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్, ఇతర అడ్వకేట్లతో భేటీ అయ్యారు. ఇందులో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కర్త డాక్టర్‌‌ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  సోమవారం కోర్టు ముందుకు రానున్న బీసీ రిజర్వేషన్ల కేసుపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా.. సోమవారం మంత్రుల బృందం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి, వాదనలు విననున్నట్లు సమాచారం.