కవిత పిటిషన్​పై విచారణ వాయిదా

కవిత పిటిషన్​పై విచారణ వాయిదా
  • 26న తదుపరి వాదనలు వింటామన్న కోర్టు 
  • సీబీఐ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన కవిత  

న్యూఢిల్లీ, వెలుగు: సీబీఐ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఈ నెల 26న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 5న సీబీఐ అధికారులు కోర్టులో అప్లికేషన్ వేశారు. 

దీన్ని పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా జైల్లోనే కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతిచ్చారు. అయితే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫు లాయర్ విక్రమ్ చౌదరి ఈ నెల 6న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

సీబీఐ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ఈ పిటిషన్ పై బుధవారం మరోసారి స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు గత శనివారమే (ఈ నెల 6) కవితను విచారించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ ఫైల్ చేయలేమని చెప్పారు. కవిత తరఫున లాయర్ మోహిత్ రావు వాదిస్తూ.. కవిత విచారణపై సీబీఐ తమకు ఎలాంటి రిప్లై అందించలేదన్నారు. 

ఈ క్రమంలో జోక్యం చేసుకున్న జడ్జి... భవిష్యత్తులో సీబీఐ చేపట్టే విచారణకు ముందస్తుగా అప్లికేషన్ ఇవ్వమని అడగాలని కవిత లాయర్లకు సూచించారు. అయితే సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై తమ వాదనలు వినిపిస్తామని మోహిత్ రావు కోర్టును అభ్యర్థించారు. దీనికి అనుమతించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.