- బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్..గంటపాటు స్తంభించిన సభ
- భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
- వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో సద్దుమణిగిన సభ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో ఇప్ప సురాపై బుధవారం జరిగిన చర్చ గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య సుమారు గంటపాటు జరిగిన వాదోపవాదాలతో సభ దద్ధరిల్లింది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన సెటైర్లు సభను పక్కదారి పట్టించాయి. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రభుత్వం ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెడుతోంది. కనీసం ఇప్ప సారా స్కీమ్‌కు మాత్రం ఆమె పేరు పెట్టకండి. దీనికి ఇప్ప టకీలా అని పేరు పెట్టండి" అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. ఇందిరాగాంధీని అవమానించడం అంటే మహిళా లోకాన్ని అవమానించడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క ఫైర్ అయ్యారు.
ఇందిరమ్మపై బీజేపీకి ఇంత అక్కసు ఎందుకని నిలదీశారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఇది ఊరు పంచాతీ కాదని, పవిత్రమైన శాసనసభ అని హితవు పలికారు. కొత్త సభ్యులు పొరపాట్లు చేసినప్పుడు సరిదిద్దాల్సిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. ఆ తప్పును సమర్థించడం సరికాదన్నారు. భేషరతుగారాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పొరపాట్లు అంగీకరించడం వల్ల గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిస్తూ.. ఇలాంటి వాదోపవాదాల వల్ల సభా సమయం వృథా అవుతోం దని, పద్దులపై చర్చ జరగనివ్వాలని కోరారు.
ఇందిరాగాంధీపై ఎంతో గౌరవం ఉంది
సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో రాకేశ్ రెడ్డి వివరణ ఇస్తూ.. ఇందిరాగాంధీపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఆమె ఒక ఉక్కు మహిళ అని పేర్కొన్నారు. కేవలం సారా స్కీమ్‌కు ఆమె పేరు వద్దనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని క్లారిటీ ఇచ్చారు.తన ఉద్దేశం తప్పు కాదని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణలో కల్తీ కల్లు వల్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఆర్గానిక్ అయిన ఇప్ప సారాను ప్రోత్సహించాలని తాను సూచించానని పేర్కొన్నారు.
అయినా కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను
రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. చివరకు సభ సద్దుమణిగింది.
