- ఆసిఫాబాద్ జిల్లాలో ఐదేండ్ల బాలుడు, భూపాలపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్
దహెగాం/జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : వడదెబ్బ కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఓ బాలుడు మృత్యువాతపడగా మరో ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే... బెజ్జూరు మండలం కుంటలమానేపల్లికి చెందిన పోర్తేటి శారద, శ్రీనివాస్ దంపతులకు శ్రీవర్ధన్ (5)తో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. శారద తన పిల్లలతో కలిసి ఇటీవల తల్లిగారి ఊరైన దహెగాం మండలం లోహ గ్రామానికి వచ్చింది. శనివారం మధ్యాహ్నం గ్రామంలో ఓ పెండ్లి ఉండడంతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో శ్రీవర్ధన్ తన మేనమామ పిల్లలతో కలిసి ఆడుకున్నాడు. సాయంత్రం ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
వడదెబ్బ తగిలినట్లు చెప్పిన ఆర్‌ఎంపీ మందులు ఇవ్వడంతో ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి పరిస్థితి విషమంగా మారడంతో బాలుడు చనిపోయాడు. మరో ఇద్దరు చిన్నారులు సైతం అస్వస్థతకు గురికావడంతో వారికి మంచిర్యాలలో ట్రీట్‌మెంట్ ఇప్పించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం బీసీ కాలనీకి చెందిన చాగర్తి లత (35) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. రోజు వారి డ్యూటీలో భాగంగా.. శనివారం అంగన్‌వాడీ సెంటర్‌లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి ఇంటికి వస్తుండగా.. అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది.
