మూసీలోకి భారీ వరద.. మంచిరేవుల గ్రామానికి రాకపోకలు బంద్

మూసీలోకి భారీ వరద.. మంచిరేవుల గ్రామానికి రాకపోకలు బంద్

రంగారెడ్డి జిల్లా: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మంచిరేవుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే గండిపేట జలాశయం గేట్లు ఎత్తడం, తద్వారా మూసీలోకి భారీ వరద ప్రవాహం కారణంగా నార్సింగి, మంచి రేవుల గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోవడం మంచిరేవుల గ్రామ ప్రజలకు శాపంగా మారింది. మూసీ నదిపై నాలుగు చోట్ల కల్వర్టులు ఉన్నా.. అన్నీ కూడా లో లెవెల్లో ఉండడంతో గండిపేట జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన వెంటనే ఈ కల్వర్టులపై నుంచి వరద ప్రవాహం ఉంటుంది. ఈ క్రమంలో.. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కల్వర్టులపై నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నారు.

ఈ పరిణామం.. మంచిరేవుల గ్రామస్తులకు ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో పెద్ద తలనొప్పిగా మారింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి 4, 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఇంటికి చేరుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నార్సింగి, మంచి రేవుల గ్రామాల మధ్యన ప్రస్తుతం ఉన్న  కల్వర్టు స్థానంలో పది అడుగుల ఎత్తులో బ్రిడ్జి నిర్మించేందుకు అధికారులు రూ. 40 కోట్లతో  ప్రతిపాదనలు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కార్యరూపం  దాల్చలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మంచి రేవుల గ్రామ ప్రజల సమస్యను గుర్తించి నార్సింగి, మంచి రేవుల గ్రామాల మధ్యన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.