నాగార్జునసాగర్ కు భారీ వరద

నాగార్జునసాగర్ కు భారీ వరద

వేగంగా పెరుగుతున్న డ్యామ్ నీటిమట్టం

ఇన్ ఫ్లో 1 లక్ష 52 వేల 674 క్యూసెక్కులు..  అవుట్ ఫ్లో: 3 వేల 912 క్యూసెక్కులు

నల్గొండ: నాగార్జునసాగర్ కు వరద  ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భారీ వర్షాలకు తోడు ఎగువన శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభించడంతో వరద పోటెత్తుతోంది. నిన్న మొన్నటి వరకు 42 వేల క్యూసెక్కులోపే ఉన్న వరద ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఉదయం 6 గంటల సమయంలో 71,651 క్యూసెక్కులు ఉన్న ఇన్ ఫ్లో ఇవాళ ఉదయానికి లక్షన్నర క్యూసెక్కులకు పెరిగింది. ఎగువన శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తితోపాటు.. 3 గేట్లు ఎత్తి  విడుదల చేస్తుండంతో నాగార్జునసాగర్ నీటిమట్టం మరింత వేగంగా పెరుగుతోంది. గతేడాది ఇదే సమయంలో నాగార్జునసాగర్ పూర్తిగా నిండిపోగా.. ఈసారి కూడా నిండిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఎగువన తుంగభద్ర.. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం డ్యామ్ లు పొంగి పారుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీరు క్రమంగా నాగార్జునాగర్ కు చేరుకుంటోంది. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ లో నీటిమట్టం  వడివడిగా పెరుగుతోంది. మరో రెండు మూడు రోజులు ఇదే వరద కొనసాగితే.. నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం ఉంది.

నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం  590 అడుగులు.. 312 టీఎంసీలు సామర్ధ్యం ఉండగా.. ప్రస్తుతం 574.70 అడుగులతో.. 268.366 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్  వద్ద ఇన్ ఫ్లో 1 లక్ష 52 వేల 674 టీఎంసీలు ఉండగా.. దిగువన ఉన్న  నది పరివాహక ప్రాంతాల్లోని రైతులకు సాగు.. కాల్వల ద్వారా తాగునీటి అవసరాల కోసం సుమారు నాలుగు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.