భద్రాచలం దగ్గర వరద గోదావరినే..50 అడుగులకు చేరిన నీటిమట్టం.. నీట మునిగిన రోడ్లు, పంటలు

భద్రాచలం దగ్గర వరద గోదావరినే..50 అడుగులకు చేరిన నీటిమట్టం..  నీట మునిగిన రోడ్లు, పంటలు
  • రెండో ప్రమాద హెచ్చరిక జారీ 
  • కంట్రోల్​రూమ్ ల ఏర్పాటు 

భద్రాచలం,వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 50 అడుగులకు చేరింది. తెల్లవారు జామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరుకోగా కలెక్టర్​జితేశ్​వి పాటిల్​రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం సబ్​కలెక్టర్​మృణాల్​శ్రేష్ఠ గోదావరి స్నానఘట్టాల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. భక్తులు సెల్ఫీలు దిగేందుకు నదిలోకి వెళ్లకుండా బారికేడ్లు, ఐరన్​జాలీలు ఏర్పాటు చేశారు. సబ్​కలెక్టర్​ఆఫీసులో 08743-232444, 7981219425, కలెక్టర్​ ఆఫీసులో 08744-241950, ఐటీడీఏ ఆఫీసులో 7995268352 నంబర్లతో కంట్రోల్​రూమ్​లను ఏర్పాటు చేశారు. వరద బాధితులు ఆయా నంబర్లకు ఫోన్​చేయాలని కలెక్టర్​సూచించారు. 24 గంటలూ ఆఫీసర్లు సిద్ధంగా ఉంటారని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బూర్గంపాడు, మణుగూరులో వాగుల సమీపంలోని వరి, పత్తి పంటలు నీటమునిగాయి. భద్రాచలం –-పేరూరు రూట్ లో దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డపై వరద పారుతుండగా రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ విలీన మండలాల్లోని ఏటపాక మండలం నెల్లిపాక వద్ద రోడ్డు మునిగింది. వీఆర్​పురం, కూనవరం మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎగువన పేరూరు వద్ద గోదావరి తగ్గుముఖం పట్టగా..  భద్రాచలం వద్ద 51 అడుగుల గరిష్ట నీటిమట్టం చేరుకుని తర్వాత తగ్గుతుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వరద కారణంగా, కురుస్తున్న వర్షాలతో మరో వారం పాటు గోదావరి తగ్గుతూ,పెరుగుతూ ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా 
ఉండాలని సూచిస్తున్నారు.

రామన్నగూడెం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఎత్తివేత 
ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరికను మంగళవారం సాయంత్రం అధికారులు ఉపసంహరించారు.  మూడు రోజులుగా తొలి ప్రమాద హెచ్చరిక కొనసాగు తుండగా నదిలో16.110 మీటర్ల మేర వరద ప్రవహించింది. కాగా.. సాయంత్రం 6 గంటలకు 15.800 మీటర్లకు తగ్గడంతో సీడబ్ల్యూసీ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఎత్తివేశారు. అయినా.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు, ఇతర పనులకు నదిలోకి దిగవద్దని అధికారులు సూచించారు.