నీట మునిగిన నిర్మల్.. ఎన్డీఆర్‌‌ఎఫ్‌ను దించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

V6 Velugu Posted on Jul 22, 2021

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లు వరద ముంపుతో అలాడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా పెరిగిపోతోంది. దీంతో రాష్ట్ర సర్కార్ అలెర్ట్ అయింది. వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది  పడకుండా చూడాలని వరద ప్రాంతాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు , ఆర్ అండ్ బీ  అధికారులను ఆదేశించారు. బాల్కొండ  నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో  భారీ వర్షాలు  కురుస్తున్నందున అక్కడ సహాయక చర్యలు  పర్యవేక్షించాలని మంత్రి వేముల  ప్రశాంత్ రెడ్డికి సూచించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీట మునిగినందున వెంటనే  అక్కడికి NDRF బృందాలను పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.
బుధవారం రాత్రి నుండి కురిసిన అతి భారీవర్షానికి నిర్మల్ జిల్లా అల్లాడిపోతోంది. నిర్మల్ పట్టణం  దాదాపుగా వరద నీటిలో మునిగిపోయింది. బైంసా డివిజన్ లో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నిర్మల్ పట్టణంలో GNR కాలనీ అంతా నీట మునిగింది. కాలనీలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. ముంపు కాలనీల్లోని ఇండ్లలో వందలాదిమంది వరదనీటిలో చిక్కుకున్నారు. నాటు పడవల సహాయంతో జనాలను బయటకు తీస్తున్నారు స్థానికులు. నిండు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, పిల్లలు ... ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలో ఇంకా చిక్కుకునే ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇన్ టైమ్ లో స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tagged Telangana, CM KCR, floods, Heavy rains, Nirmal, NDRF

Latest Videos

Subscribe Now

More News