పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు మునక

పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు మునక
  • పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు మునక
  • తొమ్మిది మంది మృతి
  • ప్రమాదకర స్థాయిలో గోదారి
  • జగిత్యాల జిల్లాలో వరదలో చిక్కుకున్న రైతులు.. కాపాడిన రెస్క్యూ టీమ్.. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు గల్లంతు

నెట్​వర్క్, వెలుగు : రాష్ట్రంలో రికాం లేని వానలతో జనం తిప్పలు పడుతున్నారు. 500కు పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా చోట్ల ఇండ్లు కూలిపోయాయి. పలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బయటకు వచ్చే పరిస్థితి లేక స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు. కామారెడ్డిలో  వర్షాల వల్ల బట్టల తీగకు కరెంట్​ వైరు తగిలి షాక్​ రావడంతో భార్య, భర్త, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు. రోడ్డు మీద వాగు పొంగడంతో హాస్పిటల్​కు తరలించే దారి లేక ములుగు జిల్లాలో ఒకరు, మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతంలో జారిపడి ఓ యువకుడు, సిద్దిపేట పట్టణంలో గోడ కూలి ఓ వృద్ధుడు చనిపోయారు. హైదరాబాద్​లోని మన్సూరాబాద్​లో చెట్టు కూలి మీదపడటంతో గాయపడ్డ ఓ మహిళ చికిత్సపొందుతూ మృతి చెందింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరి నదిలో ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. 

నిర్మల్ ​టౌన్​లోని జీఆర్​కాలనీ నీట మునిగింది. 48 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్​లోని అలకాపూరి కాలనీ, ఇదే జిల్లా చొప్పదండి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మంచిర్యాల ఎంసీహెచ్​లోకి వరదనీరు ప్రవేశించడంతో పేషెంట్లను ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు.  

కెరమెరిలో 20 సెంటీమీటర్లు
శుక్రవారం నుంచి మొదలైన భారీ వర్షాలు సోమవారం అక్కడక్కడ కొద్దిగా తెరిపిచ్చినప్పటికీ మంగళవారం మళ్లీ దంచికొట్టాయి. హైదరాబాద్​ సహా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 20 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.  

జలపాతంలో జారిపడి ఒకరు మృతి
మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతంలో జారిపడి దాసరి సాయికుమార్​(21) అనే బీటెక్​ స్టూడెంట్​ మంగళవారం చనిపోయాడు. ఖమ్మం రోటరీనగర్​కు  చెందిన సాయికుమార్​ స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూడడానికి వచ్చాడు. పైకి ఎక్కుతుండగా జారిపడి చనిపోయాడు.    
 
దవాఖానకు వెళ్లే పరిస్థితి లేక..
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురానికి చెందిన పీరీల సమ్మయ్య (32) దారులు మూసుకుపోవడంతో సరైన టైమ్​కు ఆస్పత్రికి వెళ్లలేక చనిపోయాడు. సమ్మయ్య సోమవారం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఐలాపురం, కొండాయి మధ్య కొర్ల వాగు, కొండాయి, సర్వాయి రూట్లో సుద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించి ఏటూరునాగారం దవాఖానకు వెళ్లలేకపోయాడు. పరిస్థితి విషమించి మంగళవారం చనిపోయాడు. 

బాత్రూం గోడ కూలి..
సిద్దిపేటలో బాత్రూం గోడ కూలి వృద్ధుడు చనిపోయాడు. పట్టణంలోని 1వ వార్డులో పడిగెల రాంరెడ్డి (73) మంగళవారం సాయంత్రం బాత్రూంకు వెళ్లాడు. బాగా తడిసిన గోడ కూలి.. మట్టిదిబ్బలు నడుం మీద పడడంతో కింద పడిపోయాడు.  హాస్పిటల్ కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. 

గోదావరిలో కొట్టుకొచ్చిన మృతదేహం 
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరిలో మంగళవారం ఓ మృతదేహం కొట్టుకువచ్చింది.  మృతుడి జేబులో దొరికిన ఐడెంటిటీ కార్డును బట్టి..  అతడి పేరు కౌలాస్ భగవాన్ దాస్ దంగల్(52) అని, మహారాష్ట్రంలోని  రోదాస్ నగర్ వాసిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.  డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కొట్టుకపోయిన కార్లు
కాజ్​వే దాటుతూ ఓ కారు వరదలో కొట్టుకుపోతుండగా అందులోని తండ్రీకొడుకులను స్థానికులు కాపాడారు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన మాషినపెల్లి శంకరయ్య, ఆయన కొడుకు కార్తీక్​ కారులో వరంగల్​కు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు. మంగళవారం సాయంత్రం వారి కారు ములుగు మండలం మహ్మద్​ గౌసపల్లి వద్ద కాజ్​వే దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అక్కడ ఉన్న స్థానికులు శంకరయ్య, కార్తీక్​ను కాపాడారు.  

గోదావరిఖనిలోని జీడీకే 2ఏ మోరీ పూర్తిగా నిండి ప్రవహిస్తున్నది. ఈ రూట్లో వచ్చిన కారు వరదలో చిక్కుకుని కొద్ది దూరం కొట్టుకుపోయింది. అందులోని ఐదుగురు కారు దిగి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. మంచిర్యాలకు చెందిన బస్సు డ్రైవర్‌‌ కొసరి ప్రభాకర్‌‌‌‌, ఆయన భార్య జ్యోతి మంగళవారం గోదావరిఖనిలోని మల్లికార్జున్‌‌‌‌ నగర్‌‌‌‌కు కారులో వచ్చారు. వారి బంధువులు చందా జయ, నర్మెట రజిత, ఏడాది పాపను కారులో ఎక్కించుకుని మంథనికి బయలుదేరారు. దగ్గరి దారి కావడంతో జీడీకే 2ఏ మోరీ మీదుగా వెళ్లారు. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయి..  కొంతదూరంలో మట్టిదిబ్బ అడ్డుపడి కారు ఆగిపోయింది. వారంతా ఒక్కొక్కరుగా  దిగి నడుచుకుంటూ బయటకొచ్చారు. 

కొత్తపల్లి పట్టణ శివారులోని వెలిచాల క్రాస్ రోడ్ కాజ్ వే దాటుతుండగా వరద ఉధృతికి  సిఫ్ట్ డిజైర్ కార్ వరద ధాటికి కొట్టుకుపోయి కాజ్ వే దిమ్మలకు తాకి ఆగింది... వెంటనే అక్కడ చేపలు పడుతున్న వారు గమనించి అందులో ఉన్న కరీంనగర్ కు చెందిన వేణు (ప్రభుత్వ ఉద్యోగి), డ్రైవర్ ను ప్రాణాలకు తెగించి కాపాడారు.

హైదరాబాద్​లో చెట్టు కూలి మహిళ మృతి 
ఎల్బీనగర్​, వెలుగు: హైదరాబాద్​లో చెట్టు కూలి మీద పడడంతో ఓ మహిళ మృతి చెందింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెంకు చెందిన మంజుల(46), మల్లేశ్​ దంపతులు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. కొన్నేండ్ల కింద హైదరాబాద్​కు వచ్చి మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో నివాసం ఉంటున్నారు. మంజుల పలు ఇండ్లలో పని మనిషిగా పని చేస్తూ, మల్లేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఓ ఇంట్లో పని పూర్తి చేసుకొని, మరొక ఇంటికి వెళ్తుండగా చెట్టు కూలి మంజులపై పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం రాత్రి చనిపోయింది. సహారా ఎస్టేట్ కమిటీ ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబానికి రూ.1.54లక్షలు అందించారు.