రెండిళ్లలో భారీగా గోల్డ్,నగదు చోరీ .. మజీద్ పూర్ లో ఘటన

రెండిళ్లలో భారీగా గోల్డ్,నగదు చోరీ .. మజీద్ పూర్ లో ఘటన

శామీర్ పేట, వెలుగు: తాళం వేసిన రెండిళ్లలో దొంగలు పడి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.  బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. శామీర్ పేట పరిధి మజీద్ పూర్ లో ఉండే శ్రీనివాస్ దంపతులు ఫంక్షన్ కు గుంటూరు వెళ్లారు. అతని కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. గురువారం రాత్రి సోదరుడి ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండి.. బీరువాలోని సుమారు 30 తులాల బంగారు నగలు, రూ. లక్ష విలువైన వెండి చోరీ అయినట్టు గుర్తించి తల్లిదండ్రులకు తెలిపింది.  ఆ ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తి షఫీ ఊరెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడమే కాకుండా సెల్ ఫోన్ తో పాటు రూ. 60 వేలు నగదు చోరీ అయింది. దీంతో  బాధితులు శామీర్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

క్లూస్ టీమ్స్ వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మూడు రోజుల కిందట ప్రజయ్ హోమ్స్ కాలనీలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో దొంగలు పడి 12.50 తులాల బంగారం, రూ. 68 వేల నగదును ఎత్తుకెళ్లిన ఘటన మరవకముందే రెండిళ్లలో చోరీ జరగడంతో  కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మజీద్ పూర్ పంచాయతీలో 37 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. వాటిలో  కేవలం ఒక్కటే పని చేస్తుందని, వరుస చోరీలతో ఇప్పటికైనా అధికారులు స్పందించి  సీసీ కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

అన్నోజిగూడలో..

ఘట్ కేసర్ : ఇంటి తాళం పగలగొట్టి నగలు, నగదు దొంగలు దోచుకెళ్లారు.   పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో బిజిలి తిరుపతి, సరిత దంపతులు ఉంటున్నారు. వీరికి యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురంలో పందుల దొడ్డి ఉంది. గురువారం రాత్రి దంపతులు ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్లారు. శుక్రవారం వచ్చి చూడగా తాళం పగలుగొట్టి ఉండి బీరువాలోని16 తులాల బంగారు, 35 తులాలు వెండి ఆభరణాలు, రూ. లక్ష 40వేల నగదు చోరీ అయింది. దంపతులు పోలీసులకు కంప్లయింట్ చేయగా.. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి.. సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.