కృష్ణమ్మకు జలహారం .. బేసిన్లో అన్ని ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

కృష్ణమ్మకు జలహారం .. బేసిన్లో అన్ని ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

హైదరాబాద్, వెలుగు: కృష్ణా ప్రాజెక్టులకు వరద మరింతగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే కిందకు వదులుతున్నారు. ఇటు తుంగభద్ర, సుంకేశుల ప్రాజెక్టులకూ వరద భారీగానే వస్తున్నది. దీంతో జూరాల, తుంగభద్ర, సుంకేశుల నుంచి శ్రీశైలానికి భారీగా ఇన్​ఫ్లో నమోదవుతున్నది. శ్రీశైలానికి వస్తున్న వరద 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఉన్నది. దీంతో ఆ మొత్తం వరదను పవర్​హౌస్​లు, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా లిఫ్ట్, స్పిల్ వే ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద 2.5 లక్షల క్యూసెక్కులకుపైగానే నమోదవుతున్నది. 

ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 31 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి లిఫ్ట్​ స్కీమ్ ద్వారా 2,800 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నది. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం కుడి పవర్ హౌస్ నుంచి 30,397 క్యూసెక్కులు, ఎడమ పవర్​హౌస్ నుంచి 35,315 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి స్పిల్ వే నుంచి మరో 1,90,099 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టుకు 2,55,811 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 2,48,235 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

 అందులో సాగర్ 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,04,048 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా మరో 28,420 క్యూసెక్కుల వరదను నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి కాల్వ ద్వారా 7,033 క్యూసెక్కుల నీటిని ఏపీ తరలిస్తున్నది. ఎడమ కాల్వ ద్వారా 6,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, హైదరాబాద్​ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్​ఎల్​బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులను తరలిస్తున్నారు.

పెరుగుతున్న శ్రీరాంసాగర్​ మట్టం

ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి బేసిన్​లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతున్నది. సోమవారం ప్రాజెక్టులో 28.69 టీఎంసీల స్టోరేజీ ఉండగా.. మంగళవారం సాయంత్రం నాటికి 36.46 టీఎంసీలకు చేరుకున్నది.