బూర్గుల్ కమాన్ దగ్గర బీజేపీ జెండా ఎగురవేస్తాం

బూర్గుల్ కమాన్ దగ్గర  బీజేపీ  జెండా ఎగురవేస్తాం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిసె బూర్గుల్ కమాన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి, పలువురు బీజేపీ నేతలను  పోలీసులు అడ్డుకున్నారు.  బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా నిన్న ఘర్షణ జరిగింది.  బీజేపీ జెండాను కూల్చివేశారు. అయితే ఇవాళ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. దీంతో బూర్గుల్ కమాన్ చుట్టూ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా పార్టీ జెండాను ఎగురవేస్తామని బీజేపీ నేతలు చెప్పారు.  జెండా ఎగురవేసేందుకు అనుమతి లేదని  పోలీసులు చెప్పడంతో వారిపై  వివేక్ వెంకటస్వామి,బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల హక్కులను కాపాడాలని పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వివేక్ వెంకటస్వామితోపాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. పోలీసులు తమను కొట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

టీఆర్ఎస్ గూండాయిజంను సహించేది లేదు

ఎన్ని అడ్డంకులు సృష్టించినా బూర్గుల్ కమాన్ దగ్గర బీజేపీ జెండా ఎగురవేస్తామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పిరికిపంద అని ఆయన మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అడ్డుకోవడం సరికాదన్నారు. బూర్గుల్ లో జెండా ఎగరేయకుండా వెళ్లే ప్రసక్తే లేదన్నారు. టీఆర్ఎస్ గూండాయిజంను సహించేది లేదని తేల్చి చెప్పారు. బూర్గుల్ కమాన్ దగ్గర బీజేపీ జెండా ఎగురవేసే దాకా ఈ నిరసనలు కొనసాగుతాయని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు

నిజాంసాగర్ మండలం బూర్గుల్ గ్రామంలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా జెండా ఎగురవేసేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అడ్డుకోవడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తమ నేతలను బలవంతంగా తీసుకెళ్లడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలు. గ్రామం నుంచి పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.