
- రాష్ట్రవ్యాప్తంగా వాన.. మునిగిన లోతట్టు ప్రాంతాలు
- పొంగుతున్న వాగులు.. పలుచోట్ల తెగిన రోడ్లు
- వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- భారీగా పంట నష్టం.. అంచనాలో అధికారులు
వెలుగు, నెట్వర్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో పలుచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో కల్వర్టులు, లోలెవల్వంతెనలు మునిగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ఇండ్లలోకి వరదనీరు చేరింది. దీంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయి జనం రోడ్డున పడ్డారు. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో వ్యవసాయాధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో తలమునకలయ్యారు.
మెదక్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుండపోత వాన కురిసింది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అధికంగా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లిలో 17.2, పెద్దశంకరంపేటలో 16.4, వెల్దుర్తిలో 15.8 సెంటీమీటర్ల వాన పడింది. శివ్వంపేట, వెల్దుర్తి రూట్‌లో, గంగయ్యపల్లి, బిజిలిపూర్ నుంచి దొంతికి, బొడ్మట్‌పల్లి, మెదక్ మధ్య, వెల్దుర్తి, పాంబండ గ్రామాల మధ్య, టేక్మాల్, ధన్నుర మధ్య, టేక్మాల్, జోగిపేట పట్టణాలకు, నీలకంటిపల్లి, అల్లాదుర్గంకు రాకపోకలు బంద్ అయ్యాయి. అల్లాదుర్గం, టెక్మాల్, పాపన్నపేట మండలాల్లో 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
నిర్మల్‌జిల్లాలో కడెం వాగు, దొత్తి వాగు, పలకేరు వాగులు పొంగి పొర్లుతుండడంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు తెగడం, కల్వర్టులు, వంతెనలతో పాటు కెనాల్స్ దెబ్బతినడంతో సుమారు రూ. 10 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆఫీసర్లు అంచనా వేశారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని వదలడంతో తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగాయి. ఆదిలాబాద్ పట్టణంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
కామారెడ్డి జిల్లాలో వాగులు పొంగి ప్రవహించాయి. పిట్లం మండలంలో కాకి వాగు పొంగడంతో పిట్లం, సంగారెడ్డి జిల్లా గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. మహ్మద్‌నగర్ మండలం తునికిపల్లిలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. గాలిపూర్ బ్రహ్మణ చెరువుకు బుంగ పడి పొలాల్లోకి నీళ్లు చేరాయి. మంజీర నదిలో ప్రవాహం పెరగడంతో బిచ్కుంద మండలం శేట్కూర్ వద్ద నలుగురు గొర్రెల కాపరులు , 650 గొర్రెలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ స్థానిక పోలీసు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది బోట్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు.
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం హుడ్కిలి గ్రామం దగ్గర లోలెవెల్ వంతెన పైనుంచి వరద పారుతుండడంతో సిర్పూర్ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్, కౌటాల మండలాల్లో వందలాది ఎకరాల్లోని పత్తి, కంది నీట మునిగింది. వాంకిడి మండల కేంద్రంలో ఇండ్లు, షాపుల్లోకి వరద చేరింది.
సంగారెడ్డి జిల్లాలో సోమవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లాకు వెళ్లే మార్గంలో చాప్టా(కే)వాగుపై నిర్మించిన బ్రిడ్జి నీట మునగడంతో పిట్లం, కర్నాటకకు రాకపోకలు నిలిచిపోయాయి. మూర్కుంజాల్ రాసోల్, జంమ్గి(కే), జంమ్గి(బీ) గ్రామాల మధ్య వాగు పొంగడంతో జంమ్గి(బీ) ప్రజలు ఇబ్బంది పడ్డారు.
గద్వాల జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి వాన దంచి కొట్టడంతో మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య పెద్దవాగు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. ఐజ, మంత్రాలయం మధ్య పోలోని వాగు పొంగడంతో బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది.
మంచిర్యాలలోని సూర్యనగర్, బృందావన కాలనీ, తిరుమలనగర్, హైటెక్ సిటీ కాలనీ, రెడ్డి కాలనీ ప్రాంతాల్లో రోడ్లు జలమయమై ఇండ్లలోకి నీళ్లు చేరాయి. జన్నారం, లక్సెట్టిపేట, వేమనపల్లి, కోటపల్లిస తాండూర్, కాజీపేట, జైపూర్ మండలాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ఆఫీసర్లు అంచనా వేశారు.
సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దుల్మి్ట్ట, బైరాన్‌పల్లి మార్గంలో మోయ తుమ్మెద వాగు రోడ్డు పైనుంచి పారడంతో రాకపోకలు నిలిపివేశారు. ములుగు మండలం తునికి బొల్లారంలో అయ్యప్ప చెరువు నిండటంతో ముంపుకు గురైన ఆరు కుటుంబాలకు చెందిన 23 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు.
వనపర్తి జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో 530 ఎకరాల్లో వరి నీట మునిగింది. ఖిల్లాగణపురం, ఏదుల మండల కేంద్రాలలో రెండు ఇళ్లు కూలిపోగా.. మరో 19 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పాన్‌గల్ మండలం రేమద్దుల నల్లకుంట చెరువు వాగు ఉధృతంగా పారడంతో రేమద్దుల – -కొల్లాపూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి వాన పడుతూనే ఉంది. మంగపేట, కమలాపురంలో పలు కాలనీలు నీట మునిగాయి. కల్వర్టులు, బ్రిడ్జిల పైనుంచి వరద పారుతుండడంతో వందకు పైగా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాడ్వాయి మండలం కాల్వపల్లిలో వరదలో కొట్టుకుపోయి సోలం గౌరమ్మ అనే మహిళ మృతి చెందింది.