
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం జనానికి నరకం చూపించింది. ట్రాఫిక్ జామ్ తో ఎక్కడికక్కడా వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. రెండున్నర గంటలకుపైగా వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. సాయంత్రం వర్షం రావడంతో వాహనాలన్ని ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కమర్షియల్ పనిపై వేళ్లే వాహనాలు, టూ వీలర్లు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ఎక్కడికక్కడా ట్రాఫిక్ జామ్ అయింది.
వర్షం ధాటికి తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో నగరవాసులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్ లన్నీ జనంతో నిండిపోయాయి. ట్రాఫిక్ లో చెక్కుకున్న హీరో నితిన్ కూడా మెట్రోలో ప్రయాణించారు.
ఫిలింనగర్ నుంచి రాయదుర్గం, హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ సర్కిల్ నుంచి కూకట్ పల్లి, మాదాపూర్, బాలానగర్ నుంచి కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి శ్రీనగర్ కాలనీ, బేగంపేట, నాంపల్లి, చాదర్ ఘట్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ జోన్ ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా కనిపించాయి. కిలోమీటరు దూరం వెళ్లడానికి 40 నిమిషాలు పట్టింది. వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాహనదాలు మండిపడుతున్నారు.