
- శేరిలింగంపల్లిలో అత్యధికంగా 13.7 సెంటీ మీటర్ల వర్షం
- రోడ్లపై నడుంలోతు నీళ్లు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్..
- డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలి: సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. రెండున్నర గంటల పాటు తెంపుదెగని వాన పడింది. సాయంత్రం 5-.30 గంటలకు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన వాన ఆ తర్వాత అంతటా దంచికొట్టింది. రెండున్నర గంటల్లోనే అత్యధికంగా శేరిలింగంపల్లిలో 13.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్లో 12.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నడుంలోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. పలు రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లు, కాలనీలను నీళ్లు ముంచెత్తడంతో లోతట్టులో ఉన్న ఇండ్లలోకి నీళ్లు చేరగా, ప్రజలు ఇబ్బంది పడ్డారు. గాలి వానతో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో గంటలకొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా, శుక్రవారం నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సిటీ అంతటా ట్రాఫిక్ జామ్
భారీ వర్షానికి సిటీలోని అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదల్లేదు. నీటిని క్లియర్ చేసేందుకు గంటల సమయం పట్టింది. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో కిలోమీటర్ల మేర వెహికల్స్నిలిచిపోయాయి. ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి నెలకొన్నది. సాయంత్రం లాగౌట్ అయిన ఐటీ ఉద్యోగులు ఇండ్లకు చేరుకునేందుకు గంటల సమయం పట్టింది. రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చి బౌలి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి నుంచి ఖాజాగూడ జంక్షన్,షేక్‌పేట్ నుంచి రాయదుర్గం వెళ్లే ఫ్లై ఓవర్ తోపాటు హైటెక్ సిటీ వైపు వెళ్లే రూట్ మొత్తం వెహికల్స్ నిలిచిపోయాయి. మాదాపూర్‌లోని పర్వత్ నగర్ సిగ్నల్ వద్ద 100 ఫీట్ల రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. బయో డైవర్సిటీ పార్క్ ఎదురుగా, ఐకియా నుంచి బయో డైవర్సిటీ రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘాట్ సర్కిల్ వద్ద అన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో దిల్‌సుఖ్ నగర్ వైపు వెళ్లేవారికి, ఇటు కోఠికి వచ్చేవారికి గంటల సమయం పట్టింది. తార్నాక, ముషీరాబాద్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మణికొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12లోని వెంగళరావు బిల్డింగ్ వద్ద వర్షానికి విద్యుత్ స్తంభం పడిపోయింది.
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి: సీఎస్
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్ల కంట్రోల్ రూంలు, హైడ్రా కంట్రోల్ రూమ్ లతో పాటు 100, 116కు ఫోన్ చేయాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు స్పందించాలన్నారు.
వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ
హైదరాబాద్‌లో భారీ వర్షాలపై ఢిల్లీనుంచి సీఎం రేవంత్రెడ్డి రివ్యూ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎస్, డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సిటీలో ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వాటర్ నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రాంతం వర్షపాతం (సెంటీ మీటర్లు)
శేరిలింగంపల్లి 13.7
సరూర్ నగర్ 12.5
శ్రీనగర్ కాలనీ 12.3
ఖైరతాబాద్ 12.2
ఉప్పల్ 11.4
అమీర్ పేట్ 10.6
బంజారాహిల్స్ 10.1