కుండపోత వాన.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్

కుండపోత వాన.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్: భాగ్యనగరాన్ని వరుణుడు ముంచెత్తుతున్నాడు. రెండ్రోజులుగా సాయంత్రమైతే చాలు కుండపోతగా వాన కురుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి ఆగుతూ.. సాగుతూ.. అర్ధరాత్రి దాటే వరకూ హోరు వాన సాగింది. నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్ని తలపించాయి. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇవాళ కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు ఇలానే కొనసాగే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్రాఫిక్ జామ్

సరిగ్గా సిటీ జనాలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వాన కురుస్తుండడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. మరో వైపు నాలాలు కూడా పొంగడంతో చెరువుల్లా మారాయి. దీంతో ఎక్కడ ఏ గంత ఉందో తెలియక వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ఎయిర్ పోర్టు రోడ్డు మునిగి…

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే రోడ్డు వర్షపు నీటితో మునిగిపోయింది. దీంతో అటువైపు వెళ్లే రోడ్డులో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సు రోడ్డుపై నిలిచిపోవడంతో దాని వెనుక భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆరంగార్ సర్కిల్ నుండి గగన్ పహాడ్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది.

కోఠీ ఆంధ్రా బ్యాంకు నుంచి చాదర్ ఘాట్ జంక్షన్ వరకు, హైటెక్ సిటీ, నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో, శ్రీనగర్ టీ జంక్షన్ నుంచి పంజాగుట్ట వరకు, మెహిదీపట్నం నుంచి లక్డీకపూర్ వరకూ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది.

గంటలోనే సెంటీమీటర్ల వర్షపాతం

హైదరాబాద్ నగరమంతా జోరు వాన కురుస్తోంది. సిటీ నలుమూలలా చాలా ప్రాంతాల్లో గంట సమయంలోనే రెండు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లక్డీకాపూల్, అబిడ్స్, నాంపల్లి, హిమయత్ నగర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, ఎల్బీనగర్, రామచంద్రాపురం, బంజారహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటగిరి, మణికొండ, మియాపూర్, అల్వాల్, టోలీచౌకీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్… ఇలా అన్నీ ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.