
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వానలు పడ్డాయి. మూడుచోట్ల అతిభారీ వర్షాలు, 17 ప్రాంతాల్లో భారీ వర్షాలు, 106 చోట్ల సాధారణ వానలు, 127 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, 80 ప్రాంతాల్లో అతి తేలికపాటిగా చినుకులు పడ్డాయి. నల్గొండ టౌన్ లో అత్యధికంగా 19.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని ఇబ్రహీంపేటలో 13.3 వెలుగుపల్లె 11.9, భద్రాద్రి కొత్తగూడెంలోని ములకపల్లెలో 11.2 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలోని పలు చోట్ల బుధ, గురువారాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ఆంధ్ర తీరానికి దగ్గరలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది.