పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. స్థానిక శివనగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పైకి డ్రైనేజీ నీరు పోటెత్తడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని డ్రైనేజీ పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక భద్రాచలం జాతీయ రహదారి పైకి జెన్కో గెస్ట్ హౌస్ సమీపంలో వరద నీరు చేరింది.
తాత్కాలిక మరమ్మతులు చేసినా బస్టాండ్ అవుట్ గేట్ ప్రాంగణంలోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరింది. కాగా మండలంలోని కిన్నెరసాని రిజ ర్వాయర్ కు పెద్ద ఎత్తున నీరు చేరింది. జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో నుంచి వరద కిన్నెర సానికి చేరుతోంది.407 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ లోకి సుమారు 405 అడుగుల నీరు వచ్చింది.
దీంతో అధికారులు రిజర్వాయర్ నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. స్థానిక శ్రీనివాస కాలనీ మొర్రేడు, మండలంలోని రంగాపురం వద్ద కిన్నెరసాని వాగు జోరుగా ప్రవహి స్తోంది. పట్టణంలోని నెహ్రూ నగర్ వికలాంగుల కాలనీ మధ్యలో గల రాతి చెరువుకు నీరు చేరి అలుగు పారుతుంది.
