
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గుర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్టు కొమ్మ విరిగి పడటంతో మన్నె వెంకటేష్ అనే బాలుడు మృతి చెందాడు. వ్యవసాయ పొలం వద్ద నుంచి పశువులను తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది.వెంకటేష్ పదవ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవాళ సాయంత్రం నుంచి సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వానతో పాటు ఈదురుగాలు వీచాయి. వరి నేలకొరగగా..మామిడికాయలు నేలరాలాయి. పలు చోట్ల చెట్లు కూలాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.