గ్రేటర్ ​సిటీతోపాటు శివారు జిల్లాల్లో భారీ వర్షం

గ్రేటర్ ​సిటీతోపాటు శివారు జిల్లాల్లో భారీ వర్షం
  • మోకాల్లోతు నీటిలో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు 
  • హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​కు భారీగా వరద
  • ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్

హైదరాబాద్/శంషాబాద్/జీడిమెట్ల/గండిపేట/ఎల్​బీనగర్/షాద్​నగర్/వికారాబాద్/పరిగి, వెలుగు: సోమవారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్​తోపాటు సిటీ శివారు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పడుతూనే ఉంది. చాలా కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హుస్సేన్ సాగర్​తోపాటు జంట జలాశయలైన హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​లలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మూసారం బాగ్ బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహిస్తుండడంతో మంగళవారం సాయంత్రం బ్రిడ్జిపైకి రాకపోకలు నిలిపివేశారు. పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను ఖాళీ చేయించారు. 50 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎల్​బీనగర్ నియోజకవర్గం నాగోలు అయ్యప్ప కాలనీ, సరూర్ నగర్ సీసాల బస్తీ, కోదండరాం నగర్ కాలనీ, హయత్ నగర్ బీడీఎల్ కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు, మురుగు చేరింది. జిల్లెలగూడ మిథులానగర్ ను వరద చుట్టుముట్టింది. పెద్ద చెరువు నుంచి వరద ముంచెత్తడంతో గాజులరామారం సర్కిల్ పరిధిలోని ఓక్షిత్​ ఎన్​క్లేవ్ ​కాలనీ పూర్తిగా నీట మునిగింది. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తడంతో సబ్‌ రోడ్డు గుండా వరద ప్రవహిస్తోంది. బైక్​పై అటుగా వచ్చిన అరవింద్‌గౌడ్‌ అనే యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. రోడ్డు అంచున ఉన్న రాడ్డు పట్టుకుని పోలీసులకు కాల్​చేయగా వచ్చి కాపాడారు. పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీపాద ఎన్​క్లేవ్ కాలనీలోని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. 

షాద్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయ్యవారుపల్లి, తుంపల్లి, రేగడి చిల్కమర్రి గ్రామాల్లోని వాగులకు వరద పోటెత్తింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, వరి, టమాటా పంటలు నీటమునిగాయి. కొందుర్గు మండలం పర్వతాపూర్ ప్రాథమిక పాఠశాలలోకి నీళ్లు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ- మంచన్ పహాడ్ గ్రామాల మధ్య ఉన్న కాలువ పొంగడంతో స్థానికులు అతికష్టం మీద విద్యార్థులను రోడ్డు దాటించారు. 

50 అడుగుల మేర ఈసీ వాగు

అమ్డాపూర్– కేబీదొడ్డి మధ్య ఉన్న వంతెన వద్ద ఈసీ వాగు ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 50 అడుగుల మేర ప్రవహిస్తోంది. శంషాబాద్,  మొయినాబాద్ మండలాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు. సుల్తాన్ పల్లి, కవేలిగూడ, వెంకటాపురంలోని పొలాలు నీటమునిగాయి. పరిగి నియోజకవర్గంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతోంది. పరిగి, నస్కల్ మధ్య ఉన్న వాగుకు వరద పెరిగింది. పూడూరు మండలం కడుమూరు వాగులో గ్రామానికి చెందిన హమీద్, కుమార్ గౌగ్​కు ఎద్దులు కొట్టుకుపోవడం చూసిన కానిస్టేబుల్​రఫీ వాటిని కాపాడాడు. వికారాబాద్​జిల్లాలో వాగులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. కోట్​పల్లి ప్రాజెక్టు అలుగు పారుతోంది. ధ్యాచారం బ్రిడ్జిపైగా వరద పారుతోంది. బంట్వారం, సల్ బత్తాపూర్ గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయింది. జిల్లా కలెక్టరేట్​లోని మీటింగ్​హాల్​లోకి వాననీరు చేరింది. కొన్ని ఫైళ్లు నీట మునిగాయి. తాండూరు, -సంగారెడ్డి మధ్య ఉన్న గాజీపూర్ వాగు ఉద్ధృతంగా పారుతోంది. తాండూరు, హైదరాబాద్​మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ నుంచి దన్నారం, హైదరాబాద్​కు ఇదే పరిస్థితి. వికారాబాద్​ రాజీవ్​ గృహకల్పలోని150కు పైగా ఇండ్లలోకి వాన నీరు చేరింది. భారీ వానల నేపథ్యంలో కలెక్టర్ ​నిఖిల జిల్లాలోని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

భారీగా వరద వస్తుండడంతో ఉస్మాన్ సాగర్ 12 గేట్లు, హిమాయత్ సాగర్ 8  గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. 2010లో ఉస్మాన్​సాగర్ 8 గేట్లు ఓపెన్ చేయగా12 ఏండ్ల తర్వాత 12 గేట్లు మొత్తం తెరిచారు. ప్రస్తుతం ఇన్​ఫ్లో 6,800 క్యూసెక్కులు ఉండగా అవుట్​ఫ్లో 7,308 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్​సాగర్​కు ఇన్​ఫ్లో10,000 క్యూసెక్కులు ఉండగా అవుట్​ఫ్లో 10,704గా ఉంది. గండిపేట రెండో గేటుకు దిగువన ఉండే ఓ కుటుంబం(ఐదుగురు) వరదలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రయత్నించారు. వాతావరణం అనూకూలించకపోవడంతో హెలికాప్టర్​తో వెళ్లేందుకు కుదరలేదు. అలాగే మూసీ పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. 50 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవహిస్తుండడంతో మంగళవారం రాత్రి బ్రిడ్జిపైకి రాకపోకలు నిలిపివేశారు. వరద మరింత పెరిగితే చాదర్ ఘాట్, ముసారాంబాగ్​లోని లోతట్టు కాలనీలు, మలక్​పేటలోని మూసానగర్, వాహెబ్ నగర్, పద్మానగర్ బస్తీలు నీట మునిగే అవకాశముంది. హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లోని జనం అప్రమత్తంగా అధికారులు సూచించారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41మీటర్లు కాగా, ప్రస్తుతం 513.47 మీటర్ల మేర నీరు ఉంది. ఔట్ ఫ్లో 1,793 క్యూసెక్కులు కొనసాగుతోంది. మరో రెండ్రోజుపాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిపసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్‌‌, దిల్‌సుఖ్‌నగర్‌‌, మలక్‌పేట, లక్డీకాపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, బేగంపేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ నిలిచింది.